Bigg Boss Non Stop: ఫేక్‌ అకౌంట్లతో నటరాజ్‌ ఫ్యామిలీపై ట్రోలింగ్‌!

14 Apr, 2022 15:21 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. ఐదు సీజన్స్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రయోగాత్మకంగా ఓటీటీలో ప్రారంభించగా, అక్కడ కూడా చక్కటి ఆదరణను సంపాదించుకుంటుంది. కంటెంస్టెంట్ల కొట్లాటలతో గేమ్‌ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో  ప్రస్తుతం 11 మంది మిగిలారు. వీరంతా గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని ఆడుతున్నారు. ఇక నటరాజ్‌ మాస్టర్‌ అయితే ఫోకస్‌ అంతా బిగ్‌బాస్‌ ట్రోపీ పైనే పెట్టాడు. బిగ్‌బాస్‌ 5లో పాల్గొని, తనదైన ఆటతీరు, ముక్కుసూటితనంతో వేలాది మంది అభిమానులను సంపాందించుకున్నాడు నటరాజ్‌. అయితే తన కోపం వల్లే ఐదో సీజన్‌లో ఫైనల్‌ వరకు వెళ్లలేకపోయాడు.

దీంతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో ఆయన కోపాన్ని కంట్రోల్‌ చేసుకుంటూ.. ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి గ్రూపులో చేరకుండా.. ఒంటరిగానే గేమ్‌ ఆడుతూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఆయన ఇప్పటికీ హౌస్‌లో ఉన్నాడు. ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్‌ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్‌ ఇతరులను ట్రోలింగ్‌ చేస్తుంటారు. కానీ నటరాజ్‌ మాస్టర్‌ విషయం అలా జరగడం లేదు. కొంతమంది ఆయన ఫ్యామిలీపై అభ్యంతరకరంగా కామెంట్స్‌  చేయడం వివాదంగా మారింది.

సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, నటరాజ్‌ని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని మాస్టర్‌ సన్నిహితులు చెబుతున్నారు. అసభ్యకరంగా కామెంట్స్‌ చేస్తున్నారంటూ నటరాజ్‌ ఫ్యామిలీ సభ్యులు సైబర్‌ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదును అందుకున్న సైబర్‌ క్రైం డిపార్ట్‌మెంట్‌ .. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం, నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నవారిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చిందట. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు తమ ఆటని తాము పొగుడుకోవాలి గానీ ఇంకొకరి భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని బయట నుంచి దూషించడం తగదని కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ ముందే ఓ గట్టి పీఆర్‌ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్‌లో ఉంటే బయట పీఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్‌ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్‌ చేయడం కోసం ఇతరులను ట్రోల్‌ చేయడం సరికాదు.

మరిన్ని వార్తలు