Bigg Boss Telugu OTT: సరయు మీద ప్రతీకారం తీర్చుకున్న యాంకర్‌ శివ, షాకైన కంటెస్టెంట్స్‌!

10 Mar, 2022 15:28 IST|Sakshi

బిగ్‌బాస్‌ను ఆదరించే బుల్లితెర అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈసారి టీవీలో కాకుండా ప్రయోగాత్మకంగా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ షోను చూసేవాళ్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అయితే గొడవలు, కొట్లాటలు, వినోదంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బిగ్‌బాస్‌. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ నడుస్తోంది. అందులో భాగంగా వారియర్స్‌ స్మగ్లర్లుగా, చాలెంజర్స్‌ పోలీసులుగా మారిపోయారు. స్మగ్లర్లు చేసే పనులను అడ్డుకునే క్రమంలో రెండు టీముల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వారియర్స్‌ టీమ్‌లోని అఖిల్‌, చాలెంజర్స్‌ టీమ్‌లోని అజయ్‌ మధ్య కూడా మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

గేమ్‌లో నాతో ఆడు, నా ఎమోషన్స్‌తో కాదంటూ పరోక్షంగా అజయ్‌ గురించే మాట్లాడాడు అఖిల్‌. అటు పక్క అజయేమో.. ఏదైనా జరుగుతున్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ను మధ్యలో రానివ్వద్దని వందసార్లు చెప్పాను, అయినా పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు అంటూ అఖిల్‌ మీద అసహనానికి లోనయ్యాడు. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఎవరూ పడరు కదా? అని స్రవంతితో చెప్పుకొచ్చాడు. మరో పక్క టాస్క్‌లో యాంకర్‌ శివ సరయుపై ప్రతీకారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెళ్తుంటే వెనకాల తనే బొమ్మ పడేసి ఆపై బొమ్మ దొరికిందంటూ సీజ్‌ చేశాడు.

కెమెరాలు చూస్తున్నాయంటూ సరయు శివ బట్టల దగ్గరకు వెళ్లగా అతడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, నువ్వు నామీద ఎన్నో నిందలు వేశావు. అలాంటి నీకు నా బట్టలు ముట్టే హక్కు లేదు అని ఫైర్‌ అయ్యాడు. టాస్క్‌ గరంగరంగా సాగుతున్న సమయంలో ఇంతటితో మొదటి లెవల్‌ పూర్తైందన్నాడు బిగ్‌బాస్‌. రెండో లెవల్‌లో వారియర్స్‌ పోలీసులుగా, చాలెంజర్స్‌ స్మగ్లర్లుగా మారతారని చెప్పాడు బిగ్‌బాస్‌. మరి ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? ఏ టీమ్‌ గెలుస్తుంది? అనేది తెలియాలంటే గురువారం (మార్చి 10) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

మరిన్ని వార్తలు