Bigg Boss OTT Telugu: ఆర్జే చైతూ ఎలిమినేషన్‌కు కారణాలివే!

21 Mar, 2022 17:49 IST|Sakshi

బిగ్‌బాస్‌.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. గెలుస్తారనుకున్నవాళ్లు ఓడిపోనూవచ్చు. ఎప్పుడో ఎలిమినేట్‌ కావాల్సినవాళ్లు ఫినాలేకు చేరుకోనూవచ్చు. మరీ ముఖ్యంగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవనూ వచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, ఆర్జే చైతూ ఎలిమినేట్‌ అయినందుకే! అతడి ఆట అందరికీ నచ్చిందా? అన్నది పక్కన పెడితే అతడు గేమ్‌ ఆడాడు. హౌస్‌లో తను ఉన్నాడన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నాలుగోవారంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నాలేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరి వారందరూ ఉండగా గేమ్‌ ఆడుతూ, అందులోనూ సీనియర్‌ కంటెస్టెంట్లను ముప్పు తిప్పలు పెట్టి గేమ్‌ను రఫ్ఫాడించిన ఆర్జే చైతూ ఎందుకు ఎలిమినేట్‌ అయ్యాడు? అందుకు కారణాలేంటో చూద్దాం..

మూడోవారం నామినేషన్స్‌లో మిత్ర శర్మ, శివ, చైతూ, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేశ్‌, హమీదా, నటరాజ్, అరియానా, బిందు మాధవి ఉన్నారు. ఎలిమినేషన్‌ చివరి రౌండ్‌లో స్రవంతి, చైతూ ఇద్దరే మిగిలారు. చాలామటుకు అందరూ స్రవంతి హౌస్‌ను వీడటం ఖాయం అనుకున్నారు. కానీ బిగ్‌బాస్‌ చైతూ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించడంతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్‌ ప్రేక్షకులు సైతం ఖంగు తిన్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీ పవర్‌ను అనుభవించకుండానే హౌస్‌ను వీడి వచ్చేశాడు. 

ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే నామినేషన్స్‌లో చైతూ కంటే తక్కువ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నవాళ్లుకూడా ఉన్నారు. అయినా చైతూకి పెద్దగా ఓట్లు పడకపోవడానికి ఒకరకంగా అఖిల్‌ కూడా కారణమే! ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇద్దరికీ పొసగకపోవడం, ఒకరినొకరు నామినేట్‌ చేసుకోవడం, మాటలు విసురుకోవడం, తగాదాలు పెట్టుకోవడం.. ఫైనల్‌గా ఈ గొడవ చైతూకే మైనస్‌ అయింది. అఖిల్‌ ఫ్యాన్స్‌ నామినేషన్‌లో ఉన్న అతడితో పాటు, అతని ఫ్రెండ్‌ స్రవంతికి ఓట్లు గుద్దారు, ఫలితంగా చైతూ వెనకబడిపోయాడు.

ఇక చైతూ తనకు సంబంధం లేని విషయాల్లో దూరుతున్నాడన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో చైతూ కాస్త అతి చూపిస్తున్నాడని తిట్టుకునేవాళ్లు కూడా లేకపోలేదు. నిజానికి వారియర్స్‌ వర్సెస్‌ చాలెంజర్స్‌ మధ్య నడిచిన పోరులో చాలెంజర్స్‌ తరపున గట్టిగా మాట్లాడింది చైతూనే. ఎవరితోనూ పులిహోర కలపకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ తన గేమ్‌ తను ఆడాడు. కానీ చివరాఖరకు బిగ్‌బాస్‌ అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌కు బలవక తప్పలేదు.

చదవండి: థియేటర్లలో మూవీ చూడక చాన్నాళ్లయింది.. మంచి సినిమా ఉంటే...

>
మరిన్ని వార్తలు