పాత్ర ఏదైనా.. క్యారెక్టర్‌ను గెలిపించడమే బాధ్యత: హిమజ

11 Dec, 2020 12:24 IST|Sakshi

కళల కాణాచి నుంచి కెమెరా ముందు తలుక్కున మెరిసింది. నటనానుభవం లేకపోయినా.. మోడలింగ్‌లో రాణిస్తూ బుల్లితెరపై ప్రత్యక్షమైంది. ఆకట్టుకునే అందం.. అభినయంతో ఉత్తమ నటి అయ్యింది. అందివచ్చిన అవకాశాలతో వెండితెరకు పరిచయమై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూ  తానేంటో నిరూపిస్తోంది. నటన అంటే తనకు ఎంతో ‘మజ’ అంటోంది యువ నటి హిమజ. – తెనాలి 

తెనాలి సమీపంలోని వీర్లపాలెం హిమజ స్వస్థలం. తండ్రి మలిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, తల్లి రాజ్యలక్ష్మి. ఊరిలోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారు. నూతక్కిలో స్కూలు విద్య, తెనాలి కాలేజీ నుంచి దూరవిద్యలో బీఏ చేశారు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేట్‌ సోషల్‌ టీచరుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే మోడలింగ్‌ కెరీర్‌ వైపు అడుగులు వేశారు. ఫ్యాషన్, బ్యూటీ ఈవెంట్స్‌లో పాల్గొంటూ మోడల్‌గా, టీవీ యాంకర్‌గా కొత్త జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో బుల్లితెర ఆహ్వానం ఆమె జీవితాన్నే మార్చేసింది. తొలి సీరియల్‌ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘స్వయం వరం’ సీరియల్స్‌లో బాగా పాపులరయ్యారు. రెండేళ్లు వరుసగా ఉత్తమ సీరియల్‌ హీరోయిన్‌గా అవార్డులు దక్కించుకున్నారు.  
 
వరసు ఆఫర్లు.. 
టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలతో బిజీగా ఉంటూనే వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలి సినిమా శివం. హీరోయిన్‌ రాశిఖన్నా స్నేహితురాలిగా మంచి క్యారక్టర్‌ దక్కించుకున్నారు. అదే ఏడాది నేను శైలజ, చుట్టాలబ్బాయ్‌ సినిమాల్లోనూ చేశారు. జనతా గ్యారేజ్‌తో అవకాశాలు వరుసకట్టాయి. ధృవ నుంచి చిత్రలహరి వరకు దాదాపు 15కుపైగా సినిమాల్లో నటించారు. లాక్‌డౌన్‌ తర్వాత తాజాగా ఎఫ్‌–3, వరుడు కావలెను సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యలోనే బిగ్‌బాస్‌–3లో కంటెస్టెంట్‌గా చేశారు.  

సెలవుల్లో సొంతూరుకు.. 
సొంతూరంటే ఎంతో ఆపేక్ష కలిగిన హిమజ ఏమాత్రం ఆటవిడుపు దొరికినా ‘చలో వీర్లపాలెం’ అనేస్తారు. చిన్న భద్రాచలంగా పిలుచుకునే వీర్లపాలెంలోని ప్రసిద్ధ రామాలయాన్ని తప్పక దర్శించుకుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ‘ఇట్స్‌ హిమజ’ అనే సొంత చానల్‌లోనూ ఆలోచనాత్మక వీడియోలతో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.   

‘‘పాత్ర ఏదైనా.. క్యారెక్టర్‌ను అంతిమంగా గెలిపించడమే తన బాధ్యతని హిమజ ‘సాక్షి’కి చెప్పారు. తొలినాళ్లలో ‘నీకు మేకప్‌ అంటదు...ఎన్ని చెప్పినా ఇంతే...నటన మెరుగపడదు’ అని ముఖం మీదే అన్నవారే.. ఇప్పుడు ‘ఏ క్యారక్టర్‌లోనైనా అతికినట్టు సరిపోతుంది’ అంటూ ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నారు’’.  

మరిన్ని వార్తలు