గుర్తింపు పెరిగింది... కష్టం తగ్గింది!

25 May, 2021 00:57 IST|Sakshi

‘‘బిగ్‌బాస్‌ షోతో నాకు మంచి గుర్తింపు లభించింది. అవకాశాల కోసం నేను పడుతున్న కష్టం తగ్గింది. పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివీ వైద్య అన్నారు. దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌. కృష్ణ నిర్మించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ స్పార్క్‌లో ‘క్యాబ్‌స్టోరీస్‌’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దివి మాట్లాడుతూ – ‘‘ఇందులో నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని షాలిని పాత్ర చేశాను. ఓ క్యాబ్‌ ఎక్కే క్రమంలో షాలిని పొరపాటు చేస్తుంది.

ఆ పొరపాటు కథలోని మిగతా పాత్రలపై ప్రభావితం చూపుతుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి కంటెంట్‌కు వ్యూయర్‌షిప్‌ బాగానే ఉంది. ‘క్యాబ్‌స్టోరీస్‌’ ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘డైరెక్షన్, ప్రొడక్షన్, హీరోయిన్, క్యారెక్టర్‌ ఆర్టిస్టు.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఏ విభాగంలోనైనా పని చేస్తాను. డైరెక్షన్‌ ఆలోచన ఉంది. చిరంజీవిగారు హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయనున్నాను. ఇటీవలే ‘లంబసింగి’ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాను. ‘ఘర్షణ’ వెబ్‌ సిరీస్‌లో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు