Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరు సేఫ్‌, మిగతా నలుగురు డేంజర్‌ జోన్‌లో!

11 Sep, 2021 23:17 IST|Sakshi

Bigg Boss Telugu5, Episode 07: నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్‌ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఉమాదేవి అందరిమీదా అరిచేస్తుంటే, కాజల్‌ అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అభిప్రాయపడ్డాడు. లహరి ఇరిటేట్‌ అవుతుంటే, జెస్సీ పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వట్లేదన్నాడు. లోబో మాత్రం బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ వారం హౌస్‌లో జరిగిన తప్పొప్పులను కడిగేస్తానన్నాడు నాగ్‌. మరి నేటి(సెప్టెంబర్‌ 11) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని చదివేయాల్సిందే!

జెస్సీని జైల్లో చూసి ఏడ్చేసిన సిరి, కాజల్‌
వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికై జెలు జీవితం గడుపుతున్న జెస్సీ తనలో తానే కుమిలిపోయాడు. ఇతన్ని మిగతా కంటెస్టెంట్లు ఓదారుస్తుంటే యానీ మాస్టర్‌, రవి.. వీళ్ల నటనను నిజమని నమ్ముతున్నాడంటూ జెస్సీ మీద జాలిపడ్డారు. అయితే సరయూ తనను బూతులు తిడుతోందం చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు జెస్సీ. అతడని అలాంటి పరిస్థితిలో చూసిన కాజల్‌, సిరి కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత సరయూ అతడికి దగ్గరకు వెళ్లి అన్నీ మర్చిపో అంటూ సారీ చెప్పింది. ఇక ఒకరోజు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం జెస్సీ జైలు నుంచి విడుదలయ్యాడు.

సరయూను బూతులు మాట్లాడమన్న నాగ్‌
వీకెండ్‌ అనగానే కంటెస్టెంట్లు అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారికి నాగార్జున కనిపించగానే గ్రీకువీరుడు పాటతో హోస్ట్‌ను ఫిదా చేసేందుకు ప్రయత్నించారు. ఇక నాగ్‌ వారి అందాలను పొగుడుతూనే సరయూ బూతులు మాట్లాడట్లేదేంటి? అని అనుమానం వ్యక్తం చేశాడు. తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానన్న సరయూను.. నువ్వు నీలా ఉండు అంటూ ఆమె నోటికి పని చెప్పమని ప్రోత్సహించాడు. ఇక షణ్నూను 'అరేయ్‌ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, వన్‌ వీక్‌ అయిపోయింది. ఆట మొదలెట్రా' అని దెప్పి పొడిచాడు. కాజల్‌ హౌస్‌లో మ్యాట్రీమొనీ సర్వీసెస్‌ నడిపిస్తున్నట్లు ఉందని నాగ్‌ సెటైర్‌ వేశాడు. ఇక జెస్సీ తనకు అక్షింతలు పడతాయేమోనని టెన్షన్‌తో వణికిపోతుంటే నాగ్‌ మాత్రం హౌస్‌లో బాగానే ఉంటున్నావని మెచ్చుకోవడం విశేషం.

కాజల్‌ బండారం బయటపెట్టిన నాగ్‌
అనంతరం ఇంటిసభ్యులకు 'ఎవరితో సెట్‌? ఎవరితో కట్‌?' అనే టాస్క్‌ ఇచ్చాడు. సెట్‌ అనుకునేవాళ్లకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి, కట్‌ అనుకునేవాళ్ల ఫొటోలను చింపేయాలని ఆదేశించాడు. మొదటగా ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌ విశ్వ.. తనకు మానస్‌ సెట్‌ అని, ఇంటి పనులు చేయనన్న కాజల్‌తో కట్‌ అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్‌.. కాజల్‌ తనకు వంట రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయేంటని అనడంతో కాజల్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అవి యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా రావంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేసింది. ఇక తనవంతు రాగానే జెస్సీ.. సన్నీతో సెట్‌, సరయూతో కట్‌ అని; లహరి.. ప్రియతో సెట్‌, కాజల్‌తో కట్‌ అని తేల్చేశారు.

నేను వన్‌ మ్యాన్‌ ఆర్మీ, నాకు ఎవరూ సెట్‌ కాదు: సరయూ
లోబో.. షణ్ముఖ్‌లో నాన్నగారిని చూశానని ఎమోషనల్‌ అవుతూ అతడితో సెట్‌, కాజల్‌తో కట్‌ అని వెల్లడించాడు. సరయూ వంతు రాగా.. తను ఎవరితోనూ సెట్‌ కాదని, వన్‌ మ్యాన్‌ ఆర్మీని అని పేర్కొంది. 'ఇతరుల సహకారంతో ఆడటం చాలా ఈజీ, ఎవరి సహకారం లేకుండా ఆడటం కష్టం, అది ఆడి చూపించు' అంటూ సిరి ఫొటోను చించేసి ఆమెతో కట్‌ అని చెప్పకనే చెప్పింది. శ్వేత.. యానీ మాస్టర్‌తో సెట్‌, ఉమాదేవితో కట్‌ అని; శ్రీరామచంద్ర.. కల్మషం లేని శ్వేతతో సెట్‌, కాజల్‌తో కట్‌ అని; సన్నీ.. హమీదాతో సెట్‌, రవితో కట్‌ అని చెప్పారు. సిరి మాట్లాడుతూ.. బయట మా ఇద్దరికీ పడదు కానీ ఇక్కడ షణ్నూ సెట్‌ అయ్యాడు. సరయూతో మాత్రం కట్‌ అని ఫొటో చించి చెత్తబుట్టలో పడేసింది. ఆ తర్వాత రవి సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

తెగ నటిస్తోందంటూ కాజల్‌ ఫొటో చించి చెత్తకుండీలో వేసిన ఉమాదేవి
నటరాజ్‌ మాస్టర్‌ తన వంతు వచ్చేసరికి లోబోతో సెట్‌, కాజల్‌తో కట్‌ అని క్లారిటీ ఇచ్చేశాడు. మానస్‌.. రవితో సెట్‌, జెస్సీతో కట్‌ అని చెప్పగా, రవి.. పింకీతో సెట్‌, జెస్సీతో కట్‌ అని వెల్లడించాడు. ఉమాదేవి.. పింకీతో సెట్‌, నటిస్తున్న కాజల్‌తో కట్‌ అని కుండ బద్ధలు కొట్టేసింది. హమీదా.. సరయూతో సెట్‌, షణ్నూతో కట్‌ అని; ప్రియ... యానీ మాస్టర్‌తో సెట్‌, హమీదాతో కట్‌ అని; పింకీ.. ప్రియతో సెట్‌, నటరాజ్‌ మాస్టర్‌తో కట్‌ అని; కాజల్‌.. శ్రీరామచంద్రతో సెట్‌, ఉమాదేవితో కట్‌ అని చెప్పేశారు.

ఆమెలో అమ్మను చూసుకుంటున్నా: ఏడ్చేసిన శ్వేత
యానీ మాస్టర్‌.. తనలో అమ్మను చూసుకుంటున్న శ్వేతతో సెట్‌, కాజల్‌తో కట్‌ అంది. షణ్నూ.. తనతో ఈజీగా కలిసిపోయిన రవితో సెట్‌, హమీదాతో కట్‌ అని చెప్పాడు. అనంతరం తన దిండు సీక్రెట్‌ను బయటపెట్టాడు. అది కనిపించకపోతే కంగారెత్తిపోయే తాను దిండు మీద గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన పేరు రాశానని చెప్తూ తెగ సిగ్గుపడిపోయాడు. అనంతరం నాగార్జున హమీదా సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. ఇంకా మానస్‌, కాజల్‌, సరయూ, జెస్సీ డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో నాగ్‌ ఎవర్ని సేవ్‌ చేస్తాడు? ఎవరిని ఎలిమినేట్‌ చేస్తాడు? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ కోసం వెయిట్‌ చేయాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు