Bigg Boss 5 Telugu: పింకీని హెచ్చరించిన బిగ్‌బాస్‌, ఫుల్‌ ఖుషీలో శ్రీరామ్‌

3 Dec, 2021 23:29 IST|Sakshi

టికెట్‌ టు ఫినాలే విజేతగా సింగర్‌ శ్రీరామచంద్ర

Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్‌ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్‌ ఎలిమినేట్‌ అయ్యే చాన్స్‌ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్‌ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్‌ పోలింగ్‌ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇక ఇంటిసభ్యులు 'టికెట్‌ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్‌ ఛాలెంజ్‌ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే కాజల్‌ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్‌ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్‌ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్‌ సౌండ్‌ను ట్రాక్టర్‌ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్‌ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్‌, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు.

గేమ్‌లో సన్నీని డిస్టర్బ్‌ చేసినందుకు కాజల్‌ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్‌.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్‌సెన్స్‌ లేదని తిట్టాడు. దీంతో కాజల్‌ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. 

టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్‌ ఎంచుకున్నారు హౌస్‌మేట్స్‌. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్‌లో కొన్ని ఆన్‌, కొన్ని ఆఫ్‌ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్‌ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్‌ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్‌, సన్నీ, సిరి, మానస్‌ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్‌, శ్రీరామ్‌ ఫినాలే టికెట్‌ కోసం పోటీపడ్డారు.

సిరికి మోషన్స్‌ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్‌ వాటర్‌ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్‌ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇ‍ప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్‌ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది.

ఆఖరి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ పోటీపడగా శ్రీరామ్‌ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు.  ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యానోచ్‌ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్‌ దిగులుచెందాడు. ఫినాలే టికెట్‌ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు.

మరిన్ని వార్తలు