Bigg Boss 5 Telugu: పాపం జెస్సీ, ఈసారి గట్టెక్కడం కష్టమే!

10 Sep, 2021 20:41 IST|Sakshi

ఆవేశం ఉండాలి, దానితోపాటు ఆలోచన కూడా ఉండాలి. కోపం ఉండాలి, దాని వెనకాల సరైన కారణం కూడా ఉండాలి. కానీ అవేమీ లేకుండా ఊరికే బీపీ తెచ్చుకుంటే ఆరోగ్యానికే కాదు కెరీర్‌కు కూడా ప్రమాదకరమే! ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆవేశం స్టార్లు ఎక్కువయ్యారు. కొందరు ఉన్న కారణాన్ని సాకుగా చూపుతూ గొడవకు దిగుతుంటే మరికొందరు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా ఆవేశపడుతూ అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు.

ఇప్పటికే హౌస్‌లో ఉమాదేవి ఉగ్రరూపంతో అందరినీ వణికిస్తుండగా, మరోపక్క లహరి.. లేడీ అర్జున్‌రెడ్డిలా అందరి మీదా విరుచుకుపడుతోంది. అయితే ఈ వారం వీరిద్దరూ నామినేషన్‌లో లేరు కాబట్టి ప్రస్తుతానికి వీరిద్దరినీ పక్కన పెడదాం. ఇక అనవసరంగా ఆవేశపడుతూ ఆదిలోనే అప్రతిష్ట మూటగట్టుకున్న కంటెస్టెంట్‌ ఒకరున్నారు.. అతడే మోడల్‌ జెస్సీ. ఇతడు అమాయకుడు అని అంతా అనుకున్నారు. కానీ లేనిపోని తగాదాలు పెట్టుకుంటూ తనేమీ తక్కువ కాదని నిరూపించాడు. 

హమీదా మీద జెస్సీ జోక్‌ చేయడమే అతడిని నామినేషన్‌ దాకా తీసుకొచ్చింది. అయితే వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని ఇతర కంటెస్టెంట్లు నామినేషన్‌లో ప్రస్తావించారు. ఆ సమయంలో జెస్సీ సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించడం కొంత మైనస్‌గా మారింది. పైగా అతడే హైపర్‌ అయిపోయి మళ్లీ అతడే ఏడ్చేయడం గమనార్హం. ఇక ఎప్పుడూ సిరి జపం చేసే అతడు ఆమెతో తప్ప మిగతావాళ్లతో పెద్దగా కలవట్లేదు.

అంతేకాకుండా గేమ్‌లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. యానీ మాస్టర్‌తో కుర్చీ వివాదం కూడా అతడికి మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. తాను కూర్చోవడానికి చోటివ్వమని మాస్టర్‌ అభ్యర్థించినా జెస్సీ ఆమె మాటను బేఖాతరు చేస్తూ ఆ కుర్చీలో దర్జాగా కాలు పెట్టి కూర్చోవడం అతడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే తను చేసింది తప్పని తెలుసుకున్న జెస్సీ అర్ధరాత్రి యానీ మాస్టర్‌ కాళ్లు పట్టుకుని మరీ సారీ చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బిగ్‌బాస్‌ హౌస్‌ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన జెస్సీ మొదట ఆవేశపడి ఆ తర్వాత బాధపడుతుంటాడు. ఇదే అతడికి పెద్ద మైనస్‌ అవుతోంది. ఇదిలా వుంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అన్న ప్రశ్నకు ఎక్కువమంది నెటిజన్లు జెస్సీ అనే బదులిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో హమీదా ఉంది. మరి ఈసారి సోషల్‌ మీడియా లెక్కలే నిజమవుతాయా? లేదంటే నాగార్జున తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు