Bigg Boss 5 Telugu: ప్రియకు గట్టి షాక్‌, ఎగిరెగిరి పడుతున్న ఉమాదేవి!

9 Sep, 2021 23:46 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 05: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో కామెడీ, లవ్‌ ట్రాక్‌ల సంగతేమో కానీ కొట్లాటలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. అర్థం పర్థం లేని విషయాలకు కూడా గొడవ పడుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు. కెప్టెన్‌ వచ్చాక అయినా ఇల్లు చక్కదిద్దుకుంటుందేమో అంటే ఆ తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి కెప్టెన్‌గా నియామకమైన చలాకీ సిరి వీరిని అందరినీ దారిలో పెడుతుందా? అనేది ఆసక్తికరంగానే మారింది. మరి నేటి(గురువారం) ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో చదివేద్దాం..

ఫ్రస్టేషన్‌ బయటపెట్టిన లోబో
కెప్టెన్సీ పోటీదారుడు మానస్‌కు ఇచ్చిన టాస్క్‌ ప్రకారం.. అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాన్ని లహరి, శ్రీరామచంద్ర తుంగలో తొక్కడంతో పదేపదే అలారమ్‌ మోగింది. ఫలితంగా ఇంటి సభ్యుల నిద్ర చెదిరిపోయింది. మరోపక్క షణ్నూకు సపర్యలు చేసి అలిసిపోయాడు అతడి సేవకుడు లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్‌ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. 'ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్‌ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?' అని అసహనానికి లోనయ్యాడు. దీంతో ఇది టాస్క్‌ అని, కాస్త ఓపిక పట్టమని ఊరడించాడు విశ్వ.

గెలిచిన హమీదా, ప్రియకు కోలుకోలేని దెబ్బ
అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా గెలిచింది. పవర్‌ రూమ్‌లో అడుగు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్‌ కఠినమైన టాస్కే ఇచ్చాడు. ఆమె ఎంచుకునే కంటెస్టెంట్‌ హౌస్‌లో ఎప్పటికీ కెప్టెన్‌ కాలేరని చెప్పాడు. దీంతో ఆమె నటి ప్రియ పేరు చెప్పింది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌ దగ్గర చెప్పగా అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ప్రియ మాత్రం దీన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం విశేషం.

ఐ లవ్‌యూ.. మానస్‌ను మధ్యలో లాగిన ప్రియాంక
రెస్ట్‌ రూమ్‌ క్లీన్‌ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేశాడు. ఆమెను తదేకంగా చూస్తూ ఐ లవ్‌యూ అంటూ ప్రపోజ్‌ కూడా చేశాడు. అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్‌ ఎదురుగా నాకు లైనేయ్‌ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఇదే విషయాన్ని లోబో.. మానస్‌ దగ్గర ప్రస్తావించగా అతడు తేలికగా నవ్వేసి మధ్యలో నా అనుమతి అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి ఓ ఆట ఆడేసుకున్నారు. మరోవైపు ఏమైందో ఏమో కానీ సరయూ ఉన్నట్టుండి ఏడుపందుకుంది. రెండో రోజే అందరూ కలిసి ఉండి నాలుగో రోజుకే ఎలా గ్రూప్స్‌ అవుతాయని భోరున ఏడ్చేయగా యానీ మాస్టర్‌ ఆమెను ఓదార్చింది.

సంచాకురాలి ఎంపిక విషయంలో రచ్చ
అనంతరం 'శక్తి చూపరా డింభకా!' టాస్క్‌ పూర్తైందని వెల్లడించిన బిగ్‌బాస్‌ హమీదా, మానస్‌, విశ్వ, సిరి తొలి కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. 'తొక్కరా తొక్కు హైలెస్సా' అనే టాస్కులో సైకిల్‌ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్‌ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని ఆదేశించాడు. మధ్యలో బజర్‌ మోగిన ప్రతిసారి మిగతా హౌస్‌మేట్స్‌.. పోటీదారుల్లో ఒకరికి నీళ్లు తాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ టాస్క్‌కు ప్రియ సంచాలకురాలిగా వ్యవహరిస్తే బాగుంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అతడి నిర్ణయంతో హౌస్‌లో కొంత రచ్చ జరిగినా ఎక్కువమంది ప్రియనే సంచాలకురాలిగా ఎన్నుకున్నారు.

కాజల్‌ వర్సెస్‌ సరయూ
ఈ టాస్క్‌లో కాజల్‌.. విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదంటూ అతడిని డిస్టర్బ్‌ చేయగా ఆటలో నుంచి అవుటయ్యాడు. అయితే విశ్వను ఒక్కడినే ఎందుకు టార్గెట్‌ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. నేను అమ్మాయిలకే సపోర్ట్‌ చేస్తానని, విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదని అతడికే డైరెక్ట్‌గా చెప్పానని క్లారిటీ ఇచ్చింది కాజల్‌. కాసేపటివరకు వీరి మధ్య ఓరకంగా మాటల యుద్ధమే నడిచిందని చెప్పవచ్చు. మొత్తానికి రసాభాసగా సాగిన ఈ టాస్క్‌లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా అవతరించింది. ఆమెకు ప్రియ కెప్టెన్‌ బాండ్‌ తొడిగింది. అనంతరం సిరి.. విశ్వను రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేసింది.

నాన్‌వెజ్‌ వండను, శుభ్రం కూడా చేయను
ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి లొల్లి షురూ అయింది. నాన్‌వెజ్‌ వండలేను, ఎవరైనా నాన్‌వెజ్‌ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. మార్నింగ్‌ వెజ్‌ వండేందుకు ప్రియాంక సింగ్‌ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే వెజ్‌ వండటానికి నేను పనికి రానని అంటున్నారంటూ కొత్త వాదన ఎత్తుకుని తగవు పెట్టుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన లేడీ అర్జున్‌ రెడ్డి లహరి.. ఆమె అరిస్తే పడాలా? అని నిలదీసింది. దీంతో జోక్యం చేసుకున్న కెప్టెన్‌.. లహరి 'పనికి రాదు' అనే పదం వాడలేదని ఉమాదేవికి గట్టిగానే క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ చప్పున చల్లారిపోయింది. ఇప్పుడే ఈ రేంజ్‌లో గొడవ పడితే రేపటి నుంచి కెప్టెన్‌ సిరికి కంటెస్టెంట్లు చుక్కలు చూపిస్తారేమో చూడాలి!

మరిన్ని వార్తలు