Bigg Boss 5 Telugu: జీవితంలో మాట్లాడను మానస్‌, షటప్‌ కాజల్‌.. పింకీ ఉగ్రరూపం

30 Nov, 2021 23:58 IST|Sakshi

కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కావట్లేదన్న షణ్ను

Bigg Boss Telugu 5, Episode 87: ప్రియాంక.. కాజల్‌ను నామినేట్‌ చేయడంపై మానస్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను నిన్ను సపోర్ట్‌ చేసింది, కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్‌ అనుకోలేదు కాబట్టే నామినేట్‌ చేశావని అసహనం వ్యక్తం చేశాడు. ముందు నీ ఫ్రెండ్స్‌ ఎవరో తెలుసుకోమని చెప్తూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. అతడు చెప్పాలనుకుంది చెప్పాడు, మరి తన సమాధానం కూడా వినాలి కదా! అని నిలదీసింది పింకీ. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని ఆగ్రహంతో ఊగిపోయింది.

కానీ కాసేపటికే మళ్లీ మానస్‌ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు. ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ. ఎందుకు బాధపడతావని మానస్‌ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్‌ చేయాలని చూస్తున్నావంటూ మానస్‌ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. దీంతో మానస్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రాత్రంతా మానస్‌- ప్రియాంక మధ్య ఈ గొడవ జరుగుతుంటే కాజల్‌ ఎంట్రీతో ఇది మరింత పెద్దదిగా మారింది. 'ఈ పంచాయితీలు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో మాట్లాడాలనుకోవడం' లేదు అంటూ మానస్‌ ఆమె ముఖం మీదే చెప్పాడు. అయినప్పటికీ పింకీ అతడితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించగా కాజల్‌ అది కుదరనివ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. కాజల్‌ను షటప్‌ అని తిట్టి వెళ్లింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, రెచ్చగొట్టి ఏమీ ఎరుగనట్లు సైలెంట్‌గా కూర్చుంటుందని నానా మాటలు అంది. 

కట్‌ చేస్తే పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలిసిన మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. తన కోపం, ఆవేశం, ఆవేదన అంతా కలిసి దుఃఖంగా ఉప్పొంగుకురాగా అతడిని హగ్‌ చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్‌ ఆమెను ఓదార్చాడు. మరోపక్క కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కాక షణ్ను, సిరి తల పట్టుకున్నారు. సన్నీ ఫ్యాన్స్‌ తనకు ఓట్లేస్తారనే కాజల్‌ అతడితో సన్నిహితంగా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌.

అనంతరం బిగ్‌బాస్‌ ప్రతిష్టాత్మకమైన "టికెట్‌ టు ఫినాలే" టాస్క్‌ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్‌ 'ఎండ్యురెన్స్‌ టాస్క్‌'లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్‌ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్‌ తీసుకోవచ్చని తెలిపాడు. ఆట మొదలవగానే అందరూ ఐస్‌ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్‌, మానస్‌, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్‌ దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇది అర్థమైన బిగ్‌బాస్‌ వెంటనే రెండో లెవల్‌ మొదలవుతుందంటూ షణ్ను, సన్నీలను స్థానాలు మార్చుకోమని ఆదేశించాడు. దీంతో రేపటి ఎపిసోడ్‌లో అసలు గేమ్‌ మొదలైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు..సిరికి, సన్నీకి మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు