Bigg Boss 5 Telugu: అందువల్లే సరయూ ఎలిమినేట్‌ అయింది!

12 Sep, 2021 22:23 IST|Sakshi

Bigg Boss 5 Telugu Sarayu Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ జోష్‌గా నడుస్తోంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరూ తగ్గేదేలే అన్న రేంజ్‌లో పర్ఫామ్‌ చేస్తున్నారు. అయితే షో ప్రారంభమై అప్పుడే వారమైపోయింది. యాంకర్‌ రవి, హమీదా, జెస్సీ, సరయూ, మానస్‌, కాజల్‌ తొలివారం నామినేషన్‌లోకి వచ్చారు. వీరిలో 7 ఆర్ట్స్‌ సరయూ ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించగా ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందరినీ దమ్‌దమ్‌ చేస్తానన్న ఆమె మొదటి వారంలోనే ఎందుకు ఇంటి బాట పట్టింది? ఆమె ఎలిమినేట్‌ అవ్వడానికి గల కారణాలేంటో చూసేద్దాం..

మొదటివారమే నామినేషన్‌: సరయూను ముగ్గురు నామినేట్‌ చేశారు. వాళ్లలో మానస్‌, కాజల్‌, వీజే సన్నీ ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు సరయూను నామినేట్‌ చేయకపోయినా ఆమె నామినేషన్‌ జోన్‌లోకి వచ్చేదే కాదు, తద్వారా ఎలిమినేట్‌ అయ్యేదే కాదు.

కాజల్‌తో గొడవ: సరయూ బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరినీ కలుపుకుపోయిన దాఖలాలు కనిపించలేదు. పోనీ తన పనేదో తను చేసుకుందా అంటే అదీ లేదు. కొన్నిసార్లు అనవసరంగా తగాదా పెట్టుకున్నట్లు అనిపించింది. కెప్టెన్సీ టాస్కులో పోటీదారులకు హౌస్‌మేట్స్‌ మద్దతు ఇవ్వొచ్చు, డిస్టర్బ్‌ కూడా చేయొచ్చు అని బిగ్‌బాసే స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కాజల్‌.. విశ్వను ఒక్కడినే టార్గెట్‌ చేయడాన్ని సరయూ సహించలేకపోయింది. టాస్క్‌ను సరిగా అర్థం చేసుకోకుండా ఆమెతో కొట్లాటకు దిగి మాటలు జారింది.

లెక్క చేయని సరయూ: నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడుతూ ఆడాలి. స్క్రీన్‌ స్పేస్‌ కోసం ప్రయత్నించాలి. కానీ సరయూ ఈ రెండూ చేయలేదనే తెలుస్తోంది. టాస్క్‌ల మీద కన్నా ఇంటి పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులను ఎలా తనవైపు తిప్పుకోవాలి? వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలి? అన్న విషయాలను బేఖాతరు చేసింది.

స్క్రీన్‌ స్పేస్‌ కూడా తక్కువే: వీకెండ్‌ వచ్చేసరికి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో సరయూ చివరి స్థానంలో ఉంది. హౌస్‌లో యాంకర్‌ రవి ఎంటర్‌టైన్‌ చేయగా హమీదా, మానస్‌ పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ దక్కించుకున్నారు. కాజల్‌.. అందరి వ్యక్తిగత విషయాలు అడుగుతూ, గొడవ పడుతూ ఏదో ఒక విధంగా స్క్రీన్‌పై కనిపించింది. జెస్సీ.. జైల్లోకి వెళ్లడంతో సింపతీ ఓట్లు సంపాదించాడు. కానీ సరయూ అవేవీ చేయలేదు. ఆమెకు సరైన స్క్రీన్‌ స్పేస్‌ కూడా దక్కలేదు. కనిపించిన కొద్ది సందర్భాల్లోనూ ఆమెను నెగెటివ్‌గానే చూపించారు.

బూతులు, స్మోకింగ్‌: పొగ తాగడం అనేది ఆమె వ్యక్తిగత విషయం. కానీ బిగ్‌బాస్‌ వీక్షకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఉన్నారు. చాలామంది ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. పైగా అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడటాన్ని కూడా చాలామంది తప్పుగా భావించారు. దీనివల్ల కూడా ఆమె ఓట్లకు గండి పడిందనేది కాదనలేని నిజం.

మరిన్ని వార్తలు