Bigg Boss 5 Telugu: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తే వాళ్ల ముఖాన కొడ్తా: శ్రీరామ్‌

16 Sep, 2021 00:03 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 11: కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ఏమో కానీ బిగ్‌బాస్‌ కుస్తీల ప్రోగ్రామ్‌లా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వారి ఆటతో ప్రేక్షకులకు చెమట్లు పట్టించారు. అప్పటిదాకా స్నేహగీతం పాడుకున్నవాళ్లు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. సైలెంట్‌గా కనిపించే శ్రీరామ్‌ శివాలెత్తిపోగా శ్వేత అందర్నీ ఓ ఆటాడించింది. కంటిచూపుతో గడగడలాడించే ఉమాదేవిపై దాడి చేయడంతో ఆమె కాళికా అవతారమెత్తింది. దీంతో మరోసారి యానీ మాస్టర్‌, ఉమాల మధ్య అగ్గి రాజుకుంది. మరి దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో ఇచ్చిన మూడు లెవల్స్‌లో ఏ టీమ్‌ గెలిచింది? అనేది చూసేద్దాం..

సిగ్గుతో తల దించుకోవాలి..
దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్‌ 'సాగరా సోదరా' టాస్క్‌లో నక్క(ఎల్లో) టీమ్ సభ్యులు ఎక్కువగా సాగదీసి నిలబడ్డారు. ఎల్లో టీం 33.3 మీటర్స్‌.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. అయితే ఇరువైపులా లెక్కలు తీసుకున్నాక మానస్‌ డన్‌ అనడంతో చివరి క్షణంలో శ్వేత కిందపడిపోయింది. అయితే అప్పటికే టాస్క్‌ అయిపోయింది కాబట్టి అది పరిగణనలోకి తీసుకోరని మానస్‌ టీమ్‌ ఎంత వారించినా అవతలి టీమ్‌ ఒప్పుకోలేదు. సంచాలకులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో టాస్క్‌ రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో శ్రీరామచంద్ర ఓవర్‌ ఎగ్జయిట్‌మెంట్‌లో డ్యాన్స్‌ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు. సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని కౌంటరిచ్చింది ప్రియ.

నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు: రవికి వార్నింగ్‌ ఇచ్చిన సింగర్‌
ఆ తర్వాత మళ్లీ 'పంతం నీదా నాదా' టాస్క్‌ మొదలు కాగా ఎల్లో టీమ్‌ రెచ్చిపోయి ఆడింది. ఈ క్రమంలో శ్వేత కొట్టిందని సిరి ఆరోపించింది. దీంతో తిక్క లేచిన ప్రియ.. సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని మండిపడింది. టాస్క్‌కు బ్రేక్‌ ఇచ్చిన తర్వాత యాంకర్‌ రవి.. శ్రీరామచంద్రతో ఉన్న గొడవను పరిష్కరించుకుందామని చూశాడు. కానీ అతడితో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడని శ్రీరామ్‌.. సేఫ్‌ గేమ్‌ ఆడుకో, నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు అని సలహా ఇచ్చాడు. తాను తెలుగువాళ్లకు చేరువయ్యేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నానే తప్ప గెలవడానికి రాలేదని, రూ.50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖాన కొడ్తానని చెప్పాడు.

ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చేసిన లోబో
ఇక తర్వాతి రోజు శ్రీరామ్‌- మానస్‌ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మానస్‌ను పిలిచి వయసెంత అని అడిగాడు శ్రీరామ్‌. అతడు 28 అని చెప్పాడు. అందుకే నీ ఏజ్‌ అడిగా, ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్చురిటీ లేదని సింగర్‌ వ్యాఖ్యానించగా.. మీకు ఏజ్‌ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్‌ కౌంటరిచ్చాడు మానస్‌. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనా ఐతే తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్‌ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్‌ ఆడి గెలిచింది. దీంతో వారికి ఒక ఫ్లాగ్‌ వచ్చింది.

ఉమాదేవిపై దాడి, ఆమె ఊరుకుంటుందా!
అనంతరం 'పంతం నీదా నాదా' టాస్క్‌ తిరిగి ప్రారంభమైంది. ఇందులో ​అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్‌.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్‌ టీమ్‌ మీద పడి పిల్లోస్‌ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్‌ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్‌ రెచ్చిపోయింది. ఒసేయ్‌ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. మరోపక్క పర్పుల్‌ టీమ్‌ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్‌ అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ హెచ్చరిక చేయడం గమనార్హం.

శ్రీరామ్‌తో మసాజ్‌ చేయించుకున్న హమీదా
ఈ టాస్క్‌ పూర్తయ్యే సమయానికి రెండు టీమ్స్‌ దగ్గరా 11 బెటాన్స్‌ ఉండటంతో ఇరు టీమ్స్‌కు ఐదు జెండాలు పంపించాడు బిగ్‌బాస్‌. ఇక రాత్రిపూట స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చున్న శ్రీరామ్‌ హమీదాకు మసాజ్‌ చేశాడు. ఈ సందర్భంగా హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, కానీ అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని మనసులోని మాట చెప్పింది. ఈ మాటతో గాల్లో తేలిపోయిన శ్రీరామ్‌.. ఇంకెవరైనా గుర్తొస్తే మాత్రం ఎవరి దగ్గరా ఉండకూడదు అని పంచ్‌ ఇవ్వడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. వీరి మధ్య ఏమైనా మొదలువుతుందా? లేదా ఈ ఇద్దరిదీ స్నేహమేనా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

మరిన్ని వార్తలు