Bigg Boss Telugu 5: ఓటింగ్‌లో ట్విస్ట్‌.. ఫస్ట్‌ ప్లేస్‌లో షణ్ముఖ్‌, సన్నీ వెనకంజ!

17 Dec, 2021 20:33 IST|Sakshi

Bigg Boss Telugu 5, Finale Week Voting: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎవరు టైటిల్‌ ఎగరేసుకుపోతారని బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షణ్ముఖ్‌, మానస్‌, సన్నీ, సిరి, శ్రీరామ్‌ గ్రాండ్‌ ఫినాలేకు చేరుకోగా వీరిలో ఎవరు విజేతగా అవతరిస్తారు? ఎవరు రన్నరప్‌గా నిలుస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్స్‌ చూస్తుంటే షణ్ను, సన్నీ, శ్రీరామ్‌ల మధ్యే రసవత్తర పోటీ సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అనఫీషియల్‌ ఓటింగ్‌లో మొదటి రోజు శ్రీరామ్‌ భారీ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకువెళ్లాడు.

అదే దూకుడు అధికారిక ఓటింగ్‌లోనూ కొనసాగితే శ్రీరామ్‌ గెలిచే అవకాశాలున్నాయి. పైగా ప్రభాస్‌ పెద్దమ్మ, సోనూసూద్‌, ఉత్తరాది నుంచి పలువురి స్టార్స్‌ మద్దతు అతడికి పుష్కలంగా ఉంది. ఇక ఐస్‌ టాస్క్‌లో గాయపడి మంచానికే పరిమితం కావడంతో సింపతీ ఓట్లు కూడా భారీగానే పడుతున్నాయి. కానీ రెండోరోజుకు వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న శ్రీరామ్‌ మూడో స్థానంలోకి పడిపోయాడు. యూట్యూబ్‌ సంచలనం షణ్ముఖ్‌ రెండో స్థానంలోకి దూసుకురాగా సన్నీ ప్రథమ స్థానంలోకి వచ్చి చేరాడు. అప్పటినుంచి ఈరోజు వరకు అనధికారిక ఓటింగ్‌లో సన్నీ, షణ్నులే తొలి స్థానం కోసం పోటీపడ్డట్లు కనిపించింది. దీంతో వీళ్లిద్దరిలోనే విన్నర్‌, రన్నర్‌ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. కానీ అనఫీషియల్‌ ఓటింగ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ పాల్గొనరు కాబట్టి దీన్ని పూర్తిగా విశ్వసించేందుకు ఆస్కారం లేదు.

ఇకపోతే సిరి ఎలిమినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తాజాగా ఓ ప్రోమో రిలీజ్‌ చేశాడు. ఇది సన్నీ ఓట్లను దెబ్బకొట్టడానికే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సిరి నిజంగానే ఎలిమినేట్‌ అవుతుందనుకునే చాలామంది ఆమెకు బదులుగా షణ్నుకు ఓట్లేస్తారు. పైగా తన ఒక్కగానొక్క తోడు వెళ్లిపోతుండటంతో షణ్ను కన్నీరుమున్నీరుగా విలపించడం, వీరి ఫ్రెండ్‌షిప్‌ను హైలైట్‌ చేయడం కూడా అతడికి ప్లస్‌ పాయింట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. నిజానికి సిరిది ఫేక్‌ ఎలిమినేషన్‌.

ఆ విషయం సోషల్‌ మీడియా వాడని చాలామంది ప్రేక్షకులకు రాత్రి ఎపిసోడ్‌ అయిపోయే 11 గంటల వరకు తెలియదు. సాధారణంగా ఎవరైనా ఎలిమినేట్‌ అవుతున్నారంటే వారిపై ప్రేక్షకులను సానుభూతి ఏర్పడుతుంది. ఇప్పుడు సిరి వెళ్లిపోతుందంటే కూడా ఆ సానుభూతితో ఆమె ఫ్రెండ్‌ అయిన షణ్నుకు ఓట్లు గుద్దుతారు. కొన్ని అనఫీషియల్‌ పోలింగ్స్‌లో షణ్ను దూకుడు కనబరుస్తున్నట్లు నెట్టింట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫినాలే ఓటింగ్‌లో ఒక్క ఓటు కూడా విలువైనదే. ఎలాగో సన్నీ గెలుస్తాడని ఆయన అభిమానులు సైలెంట్‌ అయ్యారంటే షణ్ను విన్నర్‌గా నిలవడం ఖాయం! ఎందుకంటే వీళ్లిద్దరికీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది. ఈ రోజుతో ఓటింగ్‌ లైన్లు ముగిసిపోతాయి. మరి విన్నర్‌ ఎవరనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!

మరిన్ని వార్తలు