Bigg Boss 6 Telugu: భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?

7 Dec, 2022 23:48 IST|Sakshi

Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్‌మేట్స్‌ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్‌ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్‌ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే! 

దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్‌మేట్స్‌. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్‌ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఇందులో రోహిత్‌, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్‌. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్‌ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్‌.

తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్‌. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్‌.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్‌, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్‌ అని నిలదీయగా నేను జస్ట్‌ టేస్ట్‌ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్‌.

అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్‌, కీర్తి పోటీపడ్డారు. హౌస్‌మేట్స్‌ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్‌ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్‌మేట్స్‌ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్‌ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్‌.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్‌ టాస్క్‌ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్‌ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు.

మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్‌ రూమ్‌ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్‌ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. అతడికి ఎంతసేపటికి క్యాండిల్‌ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్‌ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్‌, గన్‌ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్‌ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది.

చదవండి: రేవంత్‌ ఫుడ్‌ గొడవలు, ఇక మారడా?
బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు