Bigg Boss 6 Telugu: ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడా.. వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ

7 Nov, 2022 00:13 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 64: గెలుపు కోసం తాపత్రయపడింది, ఎలాగైనా గెలిచి తీరాలనుకుంది. తనమన బేధాలు చూడకుండా గేమ్‌ ఆడింది. కలలో కూడా బిగ్‌బాస్‌నే కలవరించింది. అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంది. ఎవ్వరేమన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది. భుజబలం కంటే బుద్ధి బలాన్నే ఎక్కువగా వాడుతూ తొమ్మిది వారాలు హౌస్‌లో కొనసాగింది. కళ్లు మూసినా, తెరిచినా కప్పు అందుకున్నట్లే అని పగటి కలలు కంది. కానీ చివరికి అది నిజంగానే పగటి కలగా మిగిలిపోయింది. ఊహించని ఎలిమినేషన్‌తో ఆమె గుండె ముక్కలయ్యింది. మరి ఆమె హౌస్‌ నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో ఏం మాట్లాడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

నాగార్జున రావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్‌ ఆడించాడు. మీ గేమ్‌లో పాములా కాటేసేది ఎవరు? నిచ్చెనలా సాయపడేది ఎవరని అడిగాడు. దీనికి కంటెస్టెంట్లు ఏమని సమాధానమిచ్చారంటే..

ముందుగా బాలాదిత్య.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు.
ఆదిరెడ్డి.. శ్రీహాన్‌ పాము, గీతూ నిచ్చెన
గీతూ.. బాలాదిత్య పాము, ఆది నిచ్చెన
ఫైమా.. ఇనయ పాము, గీతూ నిచ్చెన
ఇనయ.. ఆది పాము, గీతూ నిచ్చెన
రాజ్‌.. ఆది పాము, ఫైమా నిచ్చెన
రోహిత్‌.. గీతూ పాము, మెరీనా నిచ్చెన
శ్రీహాన్‌.. ఇనయ పాము, రేవంత్‌ నిచ్చెన
రేవంత్‌.. వాసంతి పాము, శ్రీహాన్‌ నిచ్చెన
వాసంతి.. శ్రీహాన్‌ పాము, ఆది నిచ్చెన
కీర్తి.. శ్రీహాన్‌ పాము, మెరీనా నిచ్చెన
మెరీనా.. గీతూ పాము, ఆది నిచ్చెన
శ్రీసత్య..  ఫైమా పాము, గీతూ నిచ్చెన అని చెప్పుకొచ్చారు.

ఇక ఇనయను ప్రాంక్‌ చేశాడు నాగ్‌. నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో తెలుసు అంటూ సీక్రెట్‌ రూమ్‌ ఓపెన్‌ చేయమన్నాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ సూర్య ఫొటో మాత్రమే ఉంది. దానికి ముద్దులు పెట్టి ఎమోషనలైంది. నువ్వు అనుకుంటున్నట్లు సూర్య సీక్రెట్‌ రూమ్‌లో లేడని, ఇంట్లో బుజ్జమ్మతో ఉన్నాడని గాలి తీశాడు. ముందు నీ గేమ్‌ మీద ఫోకస్‌ చేయమని హితవు పలికాడు.

నాగ్‌ నామినేషన్‌లో ఉన్న అందరినీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివర్లో సత్య, గీతూ ఇద్దరూ మిగిలారు. గీతూ యూ ఆర్‌ ఎలిమినేటెడ్‌ అనగానే రాయలక్క ఆ మాట వినలేక చెవులు మూసుకుంది. నెక్స్ట్‌ వీక్‌ కెప్టెన్‌ అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటి బిగ్‌బాస్‌ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఉంటే ఐయామ్‌ సారీ అని వెక్కి వెక్కి ఏడ్చింది గీతూ. నువ్వు నాకు బిగ్‌బాస్‌ ఇచ్చిన గిఫ్ట్‌ అని ఆదిని పట్టుకుని ఎమోషనలైంది. ఐ లవ్‌ యూ బిగ్‌బాస్‌, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు పోవాలని లేదు, వెళ్లను అని బోరుమని ఏడ్చింది. ఆమె వెళ్లిపోతుంటే రేవంత్‌, ఫైమా, సత్య, శ్రీహాన్‌, బాలాదిత్య, ఆదిరెడ్డి అందరూ దుఃఖం ఆపుకోలేకపోయారు.

ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‌బాస్‌ షో గెలవాలనే అనుకున్నా. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్‌ అవుతానని కలలో కూడా అనుకోలేదంటూ నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది గీతూ. ఆమెను ఓదారుస్తూ షో బ్రేకర్స్‌ ఎవరు? షో మేకర్స్‌ ఎవరు? అనే గేమ్‌ ఆడించాడు నాగ్‌. అందులో భాగంగా గీతూ.. ఆది, రేవంత్‌, సత్య, ఫైమా, శ్రీహాన్‌ల వల్ల షో ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది. ఆదిరెడ్డి అంత మంచోడిని నేనెప్పుడూ చూడలేదని, ఫైమాకు చాలా తెలివితేటలు ఉన్నాయంది. తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డానంది. ఇనయ, మెరీనా, రోహిత్‌, రాజ్‌, కీర్తిల గేమ్‌ తక్కువగా ఉందనిపించిందని చెప్పుకొచ్చింది.

తర్వాత ఆది మాట్లాడుతూ.. గీతూ ఒక యునిక్‌ కంటెస్టెంట్‌, 24 గంటలు గేమ్‌ గురించే ఆలోచించి, గేమ్‌లో రిలేషన్స్‌ కూడా చూడని ఆ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్‌ హౌస్‌ బయట చూడటం బాధగా ఉందని ఎమోషనలయ్యాడు. చివరగా రేవంత్‌.. వాలుకనుల దానా నీ విలువ చెప్పు మైనా.. అంటూ గీతూకోసం పాటందుకోవడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. నేనిక్కడి నుంచి పోను, ఇక్కడే ఉంటానని వేడుకుంది. కానీ ఒక్కసారి ఎలిమినేట్‌ అయ్యాక తనను బయటకు పంపించడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా అలాగే నిల్చుండిపోయాడు నాగ్‌.

చదవండి: గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే!
గీతూ కోసం ఏడ్చేసిన శ్రీహాన్‌, ఫైమా

Poll
Loading...
మరిన్ని వార్తలు