Bigg Boss 6 Telugu: మళ్లీ అదే తంతు.. ఓడిపోయి అవతలవాళ్ల మీద రేవంత్‌ ఏడుపు

1 Dec, 2022 23:33 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్‌ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్‌. ఛాలెంజ్‌ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్‌మేట్స్‌ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు.

ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్‌ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్‌. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్‌మేట్స్‌ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్‌ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్‌ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్‌ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్‌ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు.

దీంతో బిగ్‌బాస్‌ ఇచ్చిన రోల్‌ బేబీ రోల్‌ అనే టాస్క్‌లో రోహిత్‌, ఫైమా, శ్రీహాన్‌, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్‌ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్‌ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్‌ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్‌ మార్కుల పట్టిక రిలీజ్‌ చేయగా శ్రీహాన్‌ 10, ఆది రెడ్డి 9, రేవంత్‌ 8, ఫైమా 7, రోహిత్‌ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్‌ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్‌.

తర్వాత టికెట్‌ టు ఫినాలే రేసులో నెక్స్ట్‌ లెవల్‌ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్‌. ముందుగా అనుకున్న రూల్‌ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్‌ గేమ్‌ నుంచి సైడవగా రేవంత్‌, ఆది రెడ్డి, రోహిత్‌ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్‌ వచ్చింది.

ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్‌ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్‌ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్‌ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్‌(10), రేవంత్‌(9), ఫైమా(7), రోహిత్‌(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు.

► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్‌
► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్‌
► బిగ్‌బాస్‌ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్‌
► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య
► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి


► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా
► మొదటిసారి ఓ కామన్‌ మ్యాన్‌ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి
► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ

చదవండి:  డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది
కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్‌మేట్స్‌

మరిన్ని వార్తలు