Bigg Boss 6 Telugu: మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో.. శ్రీహాన్‌, శ్రీసత్యల పరువు తీసిన నాగ్‌

19 Nov, 2022 23:31 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్‌ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు పాస్‌ చేస్తున్నావని గడ్డి పెట్టాడు.

ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వేస్ట్‌, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్‌ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్‌ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్‌ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్‌ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్‌ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్‌ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్‌ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు.

ఇకపోతే శ్రీహాన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్‌ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్‌ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్‌.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్‌ చేయడానికి  ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్‌, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు.

ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్‌ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్‌ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్‌ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ లేవనెత్తాడు నాగ్‌. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో మీమ్స్‌ గేమ్‌ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్‌ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్‌. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్‌ ఇచ్చాడు శ్రీహాన్‌. రాజ్‌.. ఓన్లీ వన్స్‌ ఫసక్‌ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా.

ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్‌ ఇచ్చాడు రాజ్‌. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్‌ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్‌ చేస్తున్నాడు.. చైల్డ్‌ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా నీలో, ఆట్‌.. కమల్‌ హాసన్‌ అన్న మీమ్‌ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్‌. చాలా ఉన్నాయ్‌ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్‌ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్‌ రోహిత్‌కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్‌. నిజంగానే ఈరోజు ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి పని అయిపోయింది.

చదవండి: టాప్‌ 10లో నుంచి ఎలిమినేట్‌ అయింది ఎవరంటే?
పంచ్‌ ప్రసాద్‌ భార్య నిజంగా గ్రేట్‌, పెళ్లికి ముందే ప్రాబ్లమ్‌ తెలిసినా..

మరిన్ని వార్తలు