Bigg Boss 6 Telugu: కెప్టెన్‌గా శ్రీసత్య.. ఇనయకు మూడినట్లే!

4 Nov, 2022 23:20 IST|Sakshi

Bigg Boss Telugu 6, Episode 62: నేను వెధవను, వెధవన్నర వెధవను, దొంగను, నన్ను నమ్మొద్దు అని అందరి ముందే అరిచి మరీ చెప్పింది గీతూ. ఆటలో తనమన బేధాలు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కానీ ఆదిరెడ్డి వినిపించుకోలేదు. గీతక్క గీతక్క అంటూ నెత్తినెక్కించుకున్నాడు. చివరికి అతడికి వెన్నుపోటు పొడిచి గుణపాఠం నేర్పింది. ఇంతకీ మిషన్‌ పాజిబుల్‌ గేమ్‌లో ఏం జరిగింది. గీతూ వల్ల ఆది గేమ్‌ ఏమైంది? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదవాల్సిందే!

రాత్రిపూట టీషర్ట్‌లు కొట్టేయకూడదు అని రెండు టీముల లీడర్లైన ఆది, గీతూ ఒప్పందం చేసుకున్నారు. కానీ గీతూ మాత్రం అప్పటికే దొంగతనం ప్లాన్‌ వేసింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. గీతూ గేమ్‌లో లేదు, అయినా సరే ఆది రెడ్డి టీషర్ట్‌ లేపేసింది. తెల్లారాక నిజం తెలుసుకున్న ఆది.. నాతో పర్సనల్‌గా ఆడావు అంటూ గీతూమీద నిప్పులు చెరిగాడు. అటు గీతూ మాత్రం.. బుద్ధి బలం వాడామంటూ అదేపనిగా డప్పు కొట్టుకుంది. నీ మంచితనమే వీక్‌నెస్‌, దానిమీదే కొట్టానంది. మరోపక్క గేమ్‌లో హౌస్‌మేట్స్‌ నిజంగానే కొట్టుకున్నారు. ఇనయ అవతలివాళ్లను కాళ్లతో విదిలించునేందుకు ప్రయత్నించగా రేవంత్‌ ఆమెను అవతల పడేశాడు. ఇంటెన్షల్‌గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

అనంతరం బిగ్‌బాస్‌.. చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరని గీతూకు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. చనిపోయిన గీతూ.. ఆదిరెడ్డి టీషర్ట్‌ తీసింది కాబట్టి అతడు చనిపోలేదన్నాడు. కానీ మైక్‌ విసిరేసిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ నుంచి తొలగించి షాకిచ్చాడు. తర్వాత మిషన్‌ పాజిబుల్‌ టాస్క్‌ పూర్తైనట్లు ప్రకటించాడు. తన వల్ల గేమ్‌లో అవుట్‌ అయినందుకు ఆదికి అదే పనిగా సారీ చెప్పింది గీతూ. అయినా క్షమించడానికి మనసొప్పని ఆది.. త్వరలో నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టబోయే దెబ్బ అని ప్రతీకార శంఖం పూరించాడు.

మరోవైపు ఇనయ.. ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా ఉందని కంటతడి పెట్టుకుంది. బయట నాకు ఎన్నో వెన్నుపోట్లు, ఇక్కడ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు. వారి ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదిరెడ్డి నమ్మకం మీద కొట్టాను, అతడిని క్షమించమని అడుగుతాను అంటూ పడుకున్న వ్యక్తిని లేపి మరీ సారీ చెప్పింది గీతూ.

మిషన్‌ పాజిబుల్‌ టాస్క్‌ డ్రా అవడంతో రెండు టీమ్‌ లీడర్లు కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్ల పేర్లు చెప్పమన్నారు. దీంతో రెండు టీమ్స్‌.. అందరు అమ్మాయిల పేర్లు చెప్పారు. అలా బెలూన్‌ కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ పోటీపడ్డారు. ఫైనల్‌గా శ్రీసత్య గెలిచి కెప్టెన్‌ అయింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలగా మిగతావారు మాత్రం కెప్టెన్సీ చేజారిపోయిందని బాధపడ్డారు. అయితే ఇనయ, రేవంత్‌ ఫైట్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా ఇనయ(#Inaya) హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

చదవండి: నీ భార్యతో రొమాన్సా? పిచ్చిపిచ్చిగా ఉందా?: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌
ఒంటినిండి గాయాల మచ్చలు, కాళ్లలో ఐరన్‌ రాడ్లు, ఆమె ఓ ఫైటర్‌

మరిన్ని వార్తలు