Bipasha Basu Love Story: బ్రేకప్‌ నరకమే, కానీ..

16 May, 2021 13:49 IST|Sakshi

మొహబ్బతే

ప్రేమ జీవితపు కాలపు గ్యారెంటీ, వారెంటీ ఇవ్వదు..
ఈ కథకు బిపాషా బసు, జాన్‌ అబ్రహమ్‌లే నాయికా, నాయకులు!
ఇద్దరూ మధ్యతరగతి విలువలతో పెరిగి జీవన ప్రయాణంలోని అనుభవాలతో పరిణతి సాధించిన వాళ్లే!
ఇద్దరూ నిజాయితీని ఆస్తిగా భావిస్తారు. . 
అందం.. హ్యాండ్‌సమ్‌నెస్‌లో ఎవరికివారే సాటి. 
ఆమెను చూస్తే మహిళలకు గుండె ధైర్యం పెరుగుతుంది.. మగవాళ్ల గుండె జారుతుంది. 
అతను.. పురుషులకు అద్భుతంగా కనిపిస్తాడు.. స్త్రీలకు కనికట్టు చేస్తాడు. 
ఈ పర్‌ఫెక్ట్‌నెస్‌తోనే వాళ్ల మధ్య ప్రేమ ఇమడలేకపోయింది. ఇద్దరినీ చెరో ఒడ్డుకి చేర్చింది.


 
‘జిస్మ్‌’ సినిమా సెట్స్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బిపాషా బోల్డ్‌నెస్‌ను గౌరవించాడు అతను. పనిపట్ల జాన్‌కున్న సీరియస్‌నెస్‌ను ఆమె ఆరాధించింది. పరస్పరం ఉన్న ఇష్టాన్ని వ్యక్తపర్చుకున్నారు. స్క్రీన్‌ మీద ఈ జంటకు అభిమానులు పెరిగారు. వీళ్లు కలిసి నటించిన సినిమాల్లో కొన్నయితే కథతో సంబంధం లేకుండా కేవలం వీళ్ల కెమిస్ట్రీ పండే హిట్‌ అయ్యాయి. రియల్‌ లైఫ్‌లోనూ వీళ్ల ప్రేమ వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. ఆ ఇద్దరు కూడా ఏ రోజూ వాళ్ల వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ‘మేం మామూలు ఫ్రెండ్స్‌ అంతే’ అనే ఫేక్‌ స్టేట్‌మెంట్స్‌ ఎప్పుడూ ఇవ్వలేదు. ముఖ్యంగా బిపాషా.. జాన్‌తో తాను సహజీవనం చేస్తున్నాననే చెప్పింది. 

అయిదేళ్లు గడిచాకా.. ఒకసారి ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’కి బిపాషా, జాన్‌లను పిలిచాడు కరణ్‌. ఆ ఇద్దరికీ కంపాటబులిటీ టెస్ట్‌ పెట్టాడు విడివిడిగా. ఇద్దరూ ఇంచుమించు పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు. ఆ షోలో ఒకరి పరోక్షంలో ఒకరు తమ సహచరి/ సహచరుడి అభిరుచులు, అలవాట్లు, సర్దుబాట్ల గురించి చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. ఇంప్రెస్‌ చేశాయి. ఆ ప్రేమ జంటకు వీరాభిమానులను చేశాయి. షో యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను చేర్చాయి. 

తొమ్మిదేళ్లు కావొచ్చాయి.. కెరిర్‌లో ఇద్దరూ బిజీ అయిపోయారు. అయినా బిపాషా జాన్‌తో పెళ్లే ముఖ్యమనుకుంది. ఆ ప్రేమను కాపాడుకోవడమే పరమావధిగా తీసుకుంది. జాన్‌ను అడుగుతూనే ఉంది ‘పెళ్లెప్పుడు చేసుకుందాం?’ అంటూ. అతణ్ణించి స్పష్టమైన సమాధానం రాలేదు. కెరీర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడులే.. చేయనీ. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాడు కదాని ఊరుకుంది.
మరింత కాలం సాగింది ముందుకు.

ఇద్దరికీ ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌కు వెళ్లేవారు. ఒకరోజు ఆ జిమ్‌కి ఒక అమ్మాయి వచ్చింది. ఎన్‌ఆర్‌ఐ. పేరు.. ప్రియ రంచల్‌. పరిచయాలు అయ్యాయి. రోజూ ముగ్గురు కలిసే జిమ్‌ చేయడం స్టార్ట్‌ చేశారు. బిపాషా వెళ్లిపోయాక కూడా జాన్‌ ఇంకొచెం సేపు ఉండి జిమ్‌ చేయసాగాడు. ప్రియ కూడా తన అదనపు సమయాన్ని వెచ్చించ సాగింది. అక్కడ ఆకర్షణ పెరుగుతూంటే బిపాషాతో జాన్‌ గడిపే వ్యవధి తగ్గిపోతూ రాసాగింది. బిపాషా అతని కోసం ఎదురు చూడ్డం అలవాటు చేసుకుంది. రోజురోజుకూ ఆమె ఎదురు చూసే టైమ్‌ పెరగసాగింది. అన్యోన్యత ముభావాన్ని నేర్చుకుంది. కలిసి మాట్లాడుకోవడమే కరువైంది. ఒకే ఇంట్లో అపరిచితులైపోయారిద్దరూ. తామిద్దరికీ ‘పెళ్లి’ ముడి లేదని అర్థమైపోయింది బిపాషాకు. జాన్‌ కూడా గ్రహించాడు ఆ సహజీవనానికి అర్థంలేదని. పెద్దగా వాదోపవాదాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు లేకుండానే మీడియా ముందు తమ బ్రేకప్‌ను ప్రకటించింది  ఆ జంట. 

ఫీల్డ్‌లో.. బయటా అంతా  షాక్‌. పెళ్లి కబురు వినిపిస్తారనుకుంటే ఇదేంటిలా విడిపోతున్నామంటున్నారు? అని. తమ ఇంట్లోని పిల్లలే బ్రేకప్‌ మాట చెప్పినంత బాధపడ్డారు. తమ ఇంటి జంటే విడిపోయినంత నొచ్చుకున్నారు. ఇద్దరి పట్లా టన్నుల కొద్దీ సానుభూతి పెంచుకున్నారు. ఇలా జరక్కుండా ఉంటే బాగుండు  అనుకున్నారు.  అయితే ఆ ఎడబాటు వాళ్లు ప్రకటించుకున్నంత సులభంగా.. స్నేహపూర్వకంగా జరగలేదు. బిపాషా ఒక వార్తా దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తేలింది.

‘ఏ ప్రేమా స్నేహంగా బ్రేకప్‌ చెప్పుకోదు. స్నేహమే ఉంటే బ్రేకప్‌ దాకా ఎందుకు వస్తుంది? మాదీ అంతే. ఆ ఇంట్లో నేను అనాథనైపోయాననిపించింది. మా అనుబంధం పట్ల జాన్‌కు సీరియస్‌నెస్‌ లేదని, అతనికి నన్ను పెళ్లిచేసుకునే ఆలోచనే లేదని తేలింది. నా కెరీర్‌ కన్నా ప్రేమే ముఖ్యమనుకున్నా. దానికోసం కెరీర్‌నూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ ప్రేమ కూడా లేదని తెలిసింది. మోసపోయాననే ఫీలింగ్‌ వెంటాడింది. నిజాయితీ లేని చోట ఉండలేకపోయా’ అని చెప్పింది.  

ఒక టీవీ ఇంటర్వ్యూలో జాన్‌ కూడా స్పందించాడు..‘  బిపాషా అడిగినప్పుడు పెళ్లి పట్ల నేనంత సీరియస్‌గా లేని మాట నిజమే. కాని నిజాయితీ లేని, అబద్ధాలాడే నేపథ్యం నుంచి వచ్చినవాడినైతే కాదు. బ్రేకప్‌ నరకమే.  అన్నేళ్ల సహజీవనం ఎన్నో జ్ఞాపకాలను మిగిలుస్తుంది. మరిచిపోవడం అంత సులభం కాదు. కానీ తప్పదు.. ముందుకు సాగాలి కదా’ అని జాన్‌ చెప్తున్నప్పుడు అతని గొంతు జీరబోయింది బాధతో. 
బ్రేకప్‌ అయిన తర్వాత జానే ముందుగా పెళ్లిచేసుకున్నాడు ప్రియా రంచల్‌ని. తర్వాత బిపాషా పెళ్లాడింది టీవీ, సినీ స్టార్‌ కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను. 
- ఎస్సార్‌

చదవండి: టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు