కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ

9 Sep, 2020 13:38 IST|Sakshi

ముంబై: బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్‌, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది.


‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్‌ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్‌. గుర్తుంచుకోండి బాబర్‌, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్‌’ అని ట్వీట్‌ చేసింది.  కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. 


 

దీనిపై బీఎంసీ మేయర్‌ కిషోర్‌ పెడ్నేకర్‌ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. 

చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన

మరిన్ని వార్తలు