‘నా మీద నాకే జాలి.. మద్యం అలవాటయ్యింది’

19 Aug, 2020 15:07 IST|Sakshi

కెరీర్‌లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అప్పుడు తన మీద తనకే జాలి వేసేదన్నారు నటుడు బాబీ డియోల్‌. ఆ బాధను మర్చిపోవడానికి తాను మద్యానికి అలవాటు పడ్డానని తెలిపారు. ఎంతో ఉన్నతంగా సాగిన ఈ హీరో కెరీర్‌ కొన్నేళ్ల క్రితం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అయితే తాజాగా బాబీ డియోల్‌ ‘క్లాస్‌ ఆఫ్‌ 83’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్‌ మాట్లాడుతూ..‘మన మీద మనం జాలి పడుతున్నాం అంటే మన జీవితంలో అదే అత్యంత కఠినమైన దశ. ఇక అప్పుడు ప్రపంచాన్ని శపించడం మొదలుపెడతాం. నా జీవితంలో రెండు మూడేళ్ల పాటు ఇదే జరిగింది. నా మీద నాకే జాలేసేది. ప్రపంచం నాతో పని చేయాలనుకోవడం లేదని భావించాను. దాంతో మద్యానికి దగ్గరయ్యాను. మౌనంగా మారిపోయాను. అయితే ఓ రోజు నా పిల్లలు నా వైపు చూసిన చూపు నాలో మార్పుకు కారణమయ్యింది. నా తప్పేంటో తెలిసి వచ్చింది’ అన్నారు బాబీ డియోల్‌. 

‘ఓ రోజు నా పిల్లలు ‘మా నాన్న ఏంటి రోజంతా ఇంట్లోనే ఉంటాడు.. ఏం పని చేయడు.. తాగుతూనే ఉంటాడన్నట్లు’ చూశారు. ఇదే భావం నా భార్య, తండ్రి కళ్లలో కూడా కనిపించేది. దాంతో నాలో మార్పు మొదలయ్యింది. నేను ఎక్కడ తప్పు చేశానో తెలిసింది. నేనే ముందుకు సాగాలి తప్ప ఎవరి కోసం ఎదురుచూడకూడదు అని అర్థం అయ్యింది. నా ప్రయాణం నేనే చేయ్యాలని తెలిసింది. ఈ ఆలోచన వచ్చాక నేను పని చేయడం మొదలు పెట్టాను. గత రెండు మూడేళ్లుగా నేను చాల బిజీగా ఉన్నాను’ అన్నారు బాబీ డియోల్‌. అంతేకాక ‘సల్మాన్‌, షారుక్‌ ఖాన్‌ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి. కానీ వారు పోరాడుతున్నారు తప్ప వదిలేయలేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇన్‌సైడర్‌, ఔట్‌సైడర్‌ చర్చపై స్పందించారు బాబీ డియోల్‌. (మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు)

‘పరిశ్రమలో ఎవరి నుంచి మనకు మద్దతు లభించదు. నా కుటుంబం పరిశ్రమలో ఉన్నారంటే దానర్థం వారు నాకు మద్దతిచ్చారని కాదు. అదే నిజమయితే ధర్మేంద్ర కొడుకుగా నేను పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాలి. కానీ అలా జరగలేదు కదా. ధర్మేంద్ర కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ అది ఫస్ట్‌ సినిమా వరకే పనికొస్తుంది. ఆ తర్వాత నా ప్రతిభ మీదనే నా మనుగడ ఆధారపడి ఉంటుంది’ అన్నారు. ప్రస్తుతం బాబీ డియోల్‌ షారుఖ్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వస్తోన్న ‘క్లాస్‌ ఆఫ్‌ 83’లో నటిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదల కానుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా