కోలీవుడ్‌ కబురు? 

16 Sep, 2023 05:27 IST|Sakshi

దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌కు కోలీవుడ్‌ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్‌ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ఖుషీ కపూర్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్‌. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది కోలీవుడ్‌ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.

ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్‌ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్‌గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్‌ హీరోయిన్‌గా ఎంపికయ్యారనే టాక్‌ గతంలో కోలీవుడ్‌లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్‌లో ఖుషీ కపూర్‌ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్‌’ అనే వెబ్‌ ఫిల్మ్‌లో ఖుషీ కపూర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ నుంచి స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.

మరిన్ని వార్తలు