'హీరోయిన్లు డైరెక్టర్‌ లేదా నిర్మాతలకు బలవుతుంటారు'

26 Jul, 2021 12:30 IST|Sakshi

Mahika Sharma On Casting Couch : హాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. నటి మహికా శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో హీరోయిన్స్‌ను ఎప్పుడూ లైంగిక వస్తువులుగానే చూస్తారు. కొందరు బలవంతం చేస్తే మరికొందరు అవకాశాల ఆశ చూపి లోబర్చుకుంటారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అని నాతో చాలామంది చెప్పారు.  వాళ్లు చెప్పినదానికి ఒప్పుకోకపోతే అవకాశాలు రావు. ఇక జీవితాంతం కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని వచ్చిన చాలామంది హీరోయిన్లు కాస్టింగ్‌ డైరెక్టర్‌ లేదా నిర్మాతలకు బలవుతుంటారు. వాళ్లు అమ్మాయిలను కేవలం లైంగిక వస్తువులుగానే చూస్తారు.

ఇక ఏ  బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. సొసైటీ కూడా సినీ ఇండస్ట్రీని చూసే విధానం వేరుగా ఉంటుంది. హీరోయిన్స్‌ అంటే హై ప్రొఫైల్‌ ఉన్న వేశ్యలుగానే చూస్తారు. క్రేజ్‌ తప్ప గౌరవం ఉండదు. ఇది చాలా దారుణమైన విషయం' అంటూ సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మహికా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో మెరిసింది. బుల్లితెరపై రామాయణ, ఎఫ్.ఐ.ఆర్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుపై స్పందిస్తూ.. 'శిల్పాశెట్టిని మేము ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాము. అలాంటిది పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది' అని పేర్కొంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు