-

విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు

18 Sep, 2020 02:05 IST|Sakshi

‘బాలీవుడ్‌ డ్రగ్స్‌ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్‌ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్‌ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్‌ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్‌ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్‌వీర్‌ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్‌. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్‌ మాట్లాడారు. క్యూట్‌ గాళ్‌ నిధీ అగర్వాల్‌ కూడా ‘నెపోటిజమ్‌’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు.

ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా

‘డ్రగ్స్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్‌ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్‌ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్‌ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్‌ పోర్న్‌ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్‌ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్‌ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్‌ చేశారు.


మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్‌వీర్‌ షోరే

‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్‌. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్‌వీర్‌ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్‌ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్‌సైడర్స్‌ వర్సెస్‌ అవుట్‌ సైడర్స్‌ (బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్‌ చేశారు రణ్‌వీర్‌ షోరే.


వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్‌

ప్రస్తుతం డ్రగ్స్‌ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్‌ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఉన్నాయి. బాలీవుడ్‌లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్‌.

నెపోటిజమ్‌ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్‌

‘అవును.. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్‌ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్‌ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్‌ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్‌) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్‌.

జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద

డ్రగ్స్‌ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్‌ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్‌) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు