మా ఆత్మకథ చెబుతాం

17 Nov, 2020 01:25 IST|Sakshi

ఎవరో రాసిన కథల్లో, ఎవరో సృష్టించిన పాత్రలకు, ఇంకెవరో రాసిన డైలాగులు చెబుతుంటారు యాక్టర్స్‌. మంచి కథల్ని స్క్రీన్‌ మీదకు తీసుకొస్తారు. మంచి పాత్రల్ని మర్చిపోకుండా చేస్తారు. కానీ అవేవీ వాళ్లు కాదు. అది కేవలం స్క్రీన్‌ మీద చేసిన నటనే.   స్క్రీన్‌ వెనక వాళ్లదైన కథ ఒకటుంటుంది. అది చాలామందికి తెలియదు. ఆ కథను చెప్పబోతున్నాం అంటున్నారు కొందరు స్టార్స్‌. వాళ్ల కథను చెప్పడానికి రెడీ అయిపోయారు. వాళ్ల ఆత్మకథను చెబుతారట. ప్రస్తుతం ఆత్మకథలు రాసుకుంటున్న స్టార్స్‌ విశేషాలివి.  

ఇంకా పూర్తవలేదు
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ నుంచి హాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎదిగారు ప్రియాంకా చోప్రా. హాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ భారతీయ ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రియాంక జీవితాన్ని పుస్తకరూపంలో ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారామె. తన జీవిత కథతో ‘అన్‌ఫినిష్డ్‌’ (ఇంకా పూర్తవలేదు) పేరుతో ఓ పుస్తకాన్ని రాశారామె. ఇందులో తన బాల్యం, హీరోయిన్‌గా మారడం, బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి షిఫ్ట్‌ అయ్యే విశేషాలు అన్నీ చర్చించారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరి 19న విడుదల కానుంది.  

రక్షకుడిని కాదు
లాక్‌డౌన్‌ సమయంలో ఎందరో వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యారు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌. అందర్నీ సురక్షితంగా తమ ప్రాంతాలకు పంపే బాధ్యతను నవ్వుతూ భుజాన వేసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన కథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు సోనూ సూద్‌. ‘ఐయామ్‌ నో మెసయ్య’ (నేను రక్షకుడిని కాదు) పేరుతో ఈ పుస్తకం విడుదల కాబోతోంది. ‘ఇలా సహాయం చేసే బాధ్యతను నాకు కలిగించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నా కథ కాదు.. వలస కార్మికుల కథ కూడా’ అన్నారు సోనూ సూద్‌. ఈ పుస్తకం డిసెంబర్‌లో మార్కెట్లోకి వస్తుంది.  

రాయాలనిపించింది రాస్తున్నా!
బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా కూడా తన ఆత్మకథను రాస్తున్నారు. లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆత్మకథ రాయాలనే ఆలోచన వచ్చిందట ఆమెకు. లాక్‌డౌన్‌ సమయాన్ని మొత్తం ఈ పుస్తకం రాస్తూ గడిపారట. ‘మీ జీవితకథను పుస్తకరూపంలో ఎందుకు తీసుకురాకూడదు? అని చాలా మంది అడిగేవారు. నేనంత ఎక్స్‌ట్రార్డినరీగా ఏమీ చేయలేదే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వీలు దొరికింది.. రాసేశాను. కొన్ని నెలల్లో నా కథ బయటకు రాబోతోంది. నచ్చితే చదవండి. బోర్‌ అనిపిస్తే పక్కన పెట్టేయండి’ అని అన్నారు నీనా గుప్తా. ఆమె ఆత్మకథ పేరు ‘సచ్‌ కహూ తో’ (నిజం చెప్పాలంటే). వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది.  

గుర్తుగా ఉంటుందని..
‘జీవితం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్ని రికార్డ్‌ చేసుకుంటే ఎప్పుడైనా తిరిగి చూసుకోవడానికి బావుంటుంది. అందుకే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను’ అంటున్నారు సైఫ్‌ అలీఖాన్‌. ఆత్మకథ రాస్తున్నాను అని ఇటీవలే ప్రకటించారు సైఫ్‌. యాక్టర్‌గా ఎలా మారారు, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, తన కుటుంబం.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించాలనుకుంటున్నారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా