ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు

26 Feb, 2022 12:13 IST|Sakshi

వారిస్‌ వస్తున్నారోచ్‌.. హిందీలో వారిస్‌ వస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ విజిటింగ్‌ కార్డ్‌తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్‌గ్రౌండ్‌ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్‌తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్‌ మీదే. ‘వారిస్‌ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్‌ కిడ్స్‌కి వెల్‌కమ్‌ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ లిస్ట్‌ ప్రతి ఏడాది అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్‌ డైరెక్షన్‌లో ఓ వెబ్‌ ఫిలిం చేయనున్నారని టాక్‌. కామిక్‌ బుక్‌ ఆర్చీస్‌ ఆధారంగా ‘ది ఆర్చీస్‌’ అనే మ్యూజిక్‌ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్‌ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

1960 నేపథ్యంలో టీనేజర్స్‌ కథలా ఉంటుంది ఆర్చీస్‌ నవల. ఈ ప్రాజెక్ట్‌ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్‌ జరిగినట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్‌ షాప్స్‌లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్‌ టాక్‌. ఇదే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్‌ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్‌కు యాక్టింగ్‌ పట్ల ఇంట్రెస్ట్‌ ఉందని, న్యూయార్క్‌లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్‌ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్‌ చేయనున్న ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ఏప్రిల్‌లో స్టార్ట్‌ కావొచ్చు’’ అని బోనీ కపూర్‌ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్‌’ ప్రాజెక్ట్‌లో భాగమయిందనే టాక్‌ వినిపిస్తోంది. 

అంతే కాదండోయ్‌.. నటుడు సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీమ్‌ అలీఖాన్‌ (సైఫ్‌–అమృతా సింగ్​ల కుమారుడు ఇబ్రహీమ్‌) పేరు కూడా ఈ ప్రాజెక్ట్‌ కోసం జోయా అక్తర్‌ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్‌ జోన్స్‌ అనే నలుగురు టీనేజ్‌ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్‌’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్‌ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్‌ కిడ్స్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్‌తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్‌ అవుతుంది. 

ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు బాబిల్‌ ఖాన్‌ యాక్టింగ్‌ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్‌ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్‌ సిరీస్‌లో బాబిల్‌ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్‌ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్‌ చిన్న కొడుకు రజ్‌వీర్‌ (సన్నీ పెద్ద కొడుకు కరణ్​  2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్‌. అవ్నీష్‌ దర్శకుడు. 

మరోవైపు అగ్రనటుడు ఆమిర్‌ ఖాన్‌ తనయుడు (ఆమిర్‌–రీనా దత్‌ల కుమారుడు) జునైద్‌ ఖాన్‌ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్‌ యాక్టర్‌గా కన్నా కూడా రైటర్‌గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్‌ వార్త. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు షారుక్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌’ ఓ ప్రాజెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్‌ కోసమే ఆర్యన్‌ రైటర్‌గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నిర్మించనున్న ఓ వెబ్‌ సిరీస్‌లో ఆర్యన్‌ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్‌ పురి మనవడు వర్ధన్‌ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్‌ కిడ్స్‌ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్‌తో నిలబడే వారసులు ఎందరో చూడాలి.

మరిన్ని వార్తలు