ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్‌ అయ్యాను: దర్శకుడు

6 Jun, 2021 08:36 IST|Sakshi

‘ఒక అమ్మాయి కలలు కనే ప్రేమికుడిని కాను.. కోరుకునే భర్తను అంతకన్నా కాను. ప్రయత్నించాను కాని వల్ల కాలేదు. అనుబంధం అవగాహనను, రాజీపడడాన్ని ఆశిస్తుంది. ఆ రెండూ నాకు లేవు. అందుకే ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్‌ అయ్యాను. తోడు కన్నా ఏకాంతాన్నే ఎక్కువ కోరుకుంటుంది నా మనసు’ అంటూ తనను తాను విశ్లేషించుకుంటాడు బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌.


సుష్మితా సేన్‌

ఆయన జీవన వైఫల్య చిత్రమే ఇది... 
విశ్వసుందరి సుష్మితా సేన్‌ మొదటి సినిమా ‘దస్తక్‌’. దానికి దర్శకుడు విక్రమ్‌ భట్‌. అప్పుడు సుష్మితకు 20 ఏళ్లు. విక్రమ్‌కు 27. ఈ ప్రస్తావన ఎందుకంటే  ఆ లవ్‌ ఫెయిల్యూర్‌కి విక్రమ్‌ తమ వయసునే కారణంగా చూపాడు కాబట్టి. ‘దస్తక్‌’ సినిమా సెట్స్‌లో విక్రమ్‌ను బాగా పరిశీలించింది సుష్మిత. పని పట్ల అతనికున్న నిబద్ధత ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌ అతణ్ణి  సమ్మోహనపరిచింది. ప్రేమ మొదలవడానికి ఈ ప్రారంభం చాలు కదా! ఒకరికోసం ఒకరన్నట్టుగా అయిపోయారు. బాలీవుడ్‌లో గుసగుసలు పత్రికల్లో గాసిప్స్‌ కాలమ్‌ను నింపేశాయి. దస్తక్‌ షూటింగ్‌ కోసం యూనిట్‌ అమెరికా వెళ్లింది. అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించిందీ జంట. ఆ కబురును ఇక్కడ అందుకుంది అదితి భట్‌.


భార్య అదితితో విక్రమ్‌

సహించలేదు.. క్షమించలేదు
విక్రమ్‌ భార్య అదితి.. బచ్‌పన్‌ కీ దోస్త్‌.. ఫస్ట్‌ క్రష్‌. సుష్మితా సేన్‌తో అతను ప్రేమలో పడేనాటికే రెండేళ్ల వైవాహిక బంధం వాళ్లది. ఒక కూతురు కూడా. ఎన్నో ఆశలతో విక్రమ్‌ జీవిత భాగస్వామిగా అత్తింట్లోకి అడుగుపెట్టింది అదితి. అత్త, మామలు ఆమెను ఆహ్వానించిన తీరుకు నివ్వెరపోయింది. తన పట్ల వాళ్ల ప్రవర్తనకు నిర్ఘాంతపోయింది. తల్లిదండ్రుల పద్ధతిని విక్రమ్‌ విమర్శించకపోయినా తనకే అండగా ఉన్నాడు.. ఉంటాడు అన్న భరోసాతో ఆ ఇబ్బందులను భరించింది. బిడ్డ కోసం భర్త నిర్లక్ష్యాన్నీ క్షమించింది. కానీ ఎప్పుడైతే సుష్మితా సేన్‌తో అతని వ్యవహారం తెలిసిందో అప్పుడు సహించలేక ప్రశ్నించింది. ఆమెతో రాజీపడే ప్రయత్నం అతనూ చేయలేదు. దాంతో విడాకులతో వేరైంది ఆ జంట. 

ప్రేమికుడిగానూ ఓడిపోయాడు
ఇటు సుష్మితా సేన్‌ మీద ప్రేమనూ గెలిపించుకోలేకపోయాడు విక్రమ్‌. ఆ లవ్‌ స్టోరీ ఎంత వేగంగా మొదలయిందో అంతే వేగంగా ముగిసిపోయింది. ఎవరికోసం భార్య, బిడ్డను వదులుకున్నాడో ఆ తోడునూ నిలుపుకోలేకపోయాడు. ఒంటరివాడయ్యాడు. నిరాశ పట్టుకొని పీడించసాగింది. నిస్పృహతో తనుండే ఆరవ అంతస్తు ఫ్లాట్‌ బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడు. విచక్షణ ఒళ్లు విరుచుకోకపోతే దూకేసేవాడే. సుష్మితాను మరచిపోయి బతుకు మీద ప్రీతి కలగాలంటే పనిమీద దృష్టి పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు. 


అమీషా పటేల్‌

ఆంఖే... 
ఆ సమయంలోనే ‘ఆంఖే’ సినిమాకు సిద్ధమయ్యాడు. కథానాయికగా అమీషా పటేల్‌ సైన్‌ చేసింది. సెట్స్‌లో ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని గుండెలో గూడుకట్టుకున్న దిగులుకు ఆమె సాంత్వన అయింది. ఆమె కెరీర్‌ సమస్యలకు అతను శ్రోతలా మారాడు. నెమ్మదినెమ్మదిగా అమీషా పటేల్‌ నవ్వు విక్రమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపసాగింది. మనసు ఎంత చెడ్డదంటే.. కాస్త ఆప్యాయంగా పలకరించే మనిషి కనపడితే చాలు అల్లుకుపోదామని చూస్తుంది.. మునుపటి అనుభవాల చేదు ఇంకా వీడకున్నా సరే! విక్రమ్‌.. అమీషాను ప్రేమించసాగాడు. అమీషా కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. ఆ ప్రేమ అయిదేళ్ల కాలాన్ని ఇట్టే చుట్టేసింది. ఆ ఇద్దరూ పెళ్లాడతారనే అనుకున్నారు బాలీవుడ్‌లో అంతా! కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమను బ్రేక్‌ చేసుకున్నారు. 


అమీషా, విక్రమ్‌

దీనికి కారణం.. అమీషా తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి కావచ్చు అంటారు ఆ ఇద్దరికీ సంబంధించిన సన్నిహితులు. విక్రమ్‌ భట్‌ మాత్రం ‘ఆమె తన కెరీర్‌ కోసం తపన పడింది.. నేను తన కోసం తపన పడ్డాను. ఆమె కోసమే ఉన్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? అల్రెడీ ఒక రిలేషన్‌ను మనసు మీదకు తీసుకుని కోలుకోలేనంతగా దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లదలచుకోలేదు’ అంటాడు. సుస్మితాసేన్‌ విషయంలో ‘తప్పు మా ఇద్దరిదీ కాదు. మా వయసులది. పరిపక్వతలేని మా మనస్తత్వాలది’ అని చెప్తాడు. 

భార్య, కూతురికి తను మిగిల్చిన బాధ గురించి ‘జీవితంలో నాకున్న రిగ్రెటల్లా అదొక్కటే. వాళ్లనలా వదిలేయాల్సింది కాదు. ధైర్యం లేని వాడే జిత్తులు పన్నుతాడు. నేను అలాంటి పిరికివాడినే. అదితిని వదిలేసి నేనెంత తప్పు చేశానో, ఎంత వేదనను అనుభవించానో ఆమెతో చెప్పే ధైర్యం నాకు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పాఠాలే నాకు’ అంటాడు విక్రమ్‌ భట్‌. ప్రస్తుతం అతని కూతురు కృష్ణ.. తండ్రికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కూతురికి ప్రొడక్షన్‌ మెళకువలు నేర్పిస్తూ ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్‌ భట్‌. 

- ఎస్సార్‌

చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్‌ పోస్ట్‌

నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి

మరిన్ని వార్తలు