Rajkumar Rao: బయోపిక్‌గా రాబోతోన్న శ్రీకాంత్‌ బొల్లా జీవిత చరిత్ర

7 Jan, 2022 08:02 IST|Sakshi

‘‘శ్రీకాంత్‌ బొల్లా ఎందరికో ఆదర్శప్రాయుడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కెమెరా ముందు శ్రీకాంత్‌లా నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. అంధుడైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఉన్నత స్థాయికి ఎదిగారు శ్రీకాంత్‌. గురువారం ఆయన జీవిత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దర్శకురాలు తుషార్‌ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి భూషణ్‌ కుమార్‌ ఓ నిర్మాత.

భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పుట్టిన దగ్గర్నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకున్నారు శ్రీకాంత్‌. పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఎందరికో ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఆదర్శనీయం’’ అన్నారు. దివ్యాంగులకు ఉపాధి: ఆంధ్రప్రదేశ్‌ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్‌ ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బ్రెయిన్‌  కాగ్నిటివ్‌ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. హైదరాబాద్‌ కేంద్రంగా బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. 3 వేల మంది దివ్యాంగులను ఉచితంగా చదివిస్తున్నారు.

మరిన్ని వార్తలు