ఆదిపురుష్‌: లక్ష్మణుడు దొరికేశాడు!

9 Mar, 2021 12:02 IST|Sakshi

ఏకకాలంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు డార్లింగ్‌ హీరో ప్రభాస్‌. ఇప్పటికే రాధేశ్యామ్‌ పూర్తి చేయగా ప్రస్తుతం సలార్‌, ఆదిపురుష్‌ చిత్రీకరణలో భాగమయ్యాడు. తానాజీ ఫేమ్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తొలిసారిగా రాముడిగా దర్శనమివ్వనున్నాడు. ఇతడితో ఢీ కొట్టేందుకు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా రెడీ అవుతున్నాడు. ఇక సీత ఎవరన్నదానిపై పలువురి పేర్లు వినిపించగా చివరికి కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా వుంటే తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్‌ యంగ్‌ హీరోను పట్టుకొస్తున్నట్లు సమాచారం. విక్కీ కౌశల్‌ ప్రభాస్‌ పాత్రకు తమ్ముడిగా నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు అతడి పేరునే ఖాయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా "ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌" సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన విక్కీ కౌశల్‌ ప్రస్తుతం "అశ్వత్థామ" చేస్తున్నాడు. మహాభారతంలో మరణమనేదే లేని వరాన్ని పొందిన అశ్వత్థామ కథను ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి హేమ మాలిని నటించనుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

చదవండి: ఇలాంటి అభిమాని ఉంటే ఇంకేం కావాలి: హీరో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు