తెలుగు తెరపై బాలీవుడ్‌ భామల గ్రాండ్‌ ఎంట్రీ

1 Mar, 2021 19:27 IST|Sakshi

ప్రతి ఏడాది తెలుగు తెరపై బాలీవుడ్‌ భామలు ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మధ్య తెలుగు చిత్రపరిశ్రమ బాక్సాఫీస్‌ స్టామినా పెరగడంతో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ సైతం టాలీవుడ్‌వైపు దృష్టి పెడుతున్నారు. హిందీ సినిమాల్లోని పాపులర్‌ పాటల్లో ‘బొంబై సే ఆయా మేరీ దోస్త్‌’ (ముంబై నుంచి ఫ్రెండ్‌ వచ్చారు) ఒకటి. సినిమాకి భాషా భేదాలు లేవు. హిందీ దోస్తులు ఇక్కడ... ఇక్కడి దోస్తులు అక్కడ సినిమాలు చేస్తుంటారు. రానున్న రోజుల్లో తెలుగు తెరపై ప్రత్యక్షం కానున్న కొందరు హిందీ హీరోయిన్లపై స్పెషల్‌ స్టోరీ. 

ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆలియా ఎంట్రీ ఖరార్‌
బీ టౌన్‌లో టాప్‌ హీరోయిన్స్‌లో ఆలియా భట్‌ ఒకరు. ఈ క్రేజీ హీరోయిన్‌ను తెలుగుకి తీసుకువచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఆలియా భట్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా కనిపిస్తారు ఆలియా. ఇదే చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు ఐరిష్‌ నటి ఒలీవియా మోరిస్‌. ఈ హీరోయిన్‌కు కూడా ఇది తొలి తెలుగు సినిమానే. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  విడుదల కానుంది. 

గ్రాండ్‌ ఎంట్రీ
హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు.. ‘చప్పాక్‌’లో యాసిడ్‌ బాధితురాలికి గురైన అమ్మాయిగా డీ–గ్లామరస్‌ రోల్‌ చేశారు. ‘పద్మావత్‌’ వంటి పీరియాడికల్‌ సినిమా కూడా చేశారు. ఇప్పుడు దీపికా ప్రతిభ తెలుగు తెరపైకి రానుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్‌ ఇండియా సినిమాతో తెలుగులోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు దీపికా పదుకోన్‌. ఈ సినిమా షూటింగ్‌ వేసవి తర్వాత ఆరంభం అవుతుంది.

అనన్యా ఆగయా
బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్యా పాండేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు క్రేజీ డైరెక్టర్‌ పూరి  జగన్నాథ్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో వస్తోన్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘లైగర్‌’లో హీరోయిన్‌గా చేస్తున్నారు అనన్యా పాండే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ‘లైగర్‌’ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ సినిమాకు ముందు స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2, పతీ పత్నీ ఔర్‌ ఓ, ఖాలీ పిలీ వంటి హిందీ సినిమాల్లో నటించారు అనన్యా.

ప్రియాంకా, జోయా మధ్యలో రానా!
మరాఠీ ఫిల్మ్‌ ‘ఏకుల్తి ఏక్‌’ (2013) సినిమాతో నటిగా శ్రియా పిల్గొన్కర్‌ జీవితం మొదలైంది. ఆ తర్వాత హిందీలో ప్యాన్, హౌస్‌ అరెస్ట్‌ వంటి సినిమాలు చేశారు శ్రియ. తాజాగా రానా ‘అరణ్య’ సినిమాలో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేశారామె. శ్రియ యాక్టర్‌ మాత్రమే కాదు.. డైరెక్టర్‌గా కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ కూడా చేశారు. స్విమ్మింగ్‌లోనూ ప్రావీణ్యత ఉంది. ‘అరణ్య’ సినిమా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కాడన్‌’గా మార్చి 26న విడుదల కానుంది. ఇదే సినిమాతో న్యూఢిల్లీకి చెందిన జోయా హుస్సేన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ కూడా జరుగుతోంది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ముక్కాబాజ్‌’ (2018) సినిమాతో నటిగా జోయా హుస్సేన్‌ స్టార్ట్‌ అయ్యారు.

సయీ.. వచ్చిందోయీ
హీరోయిన్‌గా తొలి ప్రయత్నంలోనే సల్మాన్‌ ఖాన్‌ వంటి టాప్‌ స్టార్‌ సినిమాలో నటించే అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఈ అదృష్టం సయీ మంజ్రేకర్‌కు దక్కింది. సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. ఇప్పుడు ఈ భామ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘గని’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించబోతున్నారు. బాక్సింగ్‌  బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ‘గని’ ఈ ఏడాది రిలీజ్‌ కానుంది.

అందాల ఊర్వశి
‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ సినిమాతో హీరోయిన్‌గా హిందీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఊర్వశీ రౌతేలా. ఇప్పుడు ఊర్వశి మనసు తెలుగువైపు మళ్లింది. మోహన్‌ భరద్వాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న హిందీ, తెలుగు ద్విభాషా చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌’లో నటిస్తున్నారు ఊర్వశి. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘బ్లాక్‌ రోజ్‌’ సినిమాకు తెలుగు దర్శకుడు సంపత్‌ నంది కథ అందిస్తున్నారు.

జాక్వెలిన్‌... ఇన్‌
ప్రభాస్‌ ‘సాహో’ సినిమాలో ‘బ్యాడ్‌ బాయ్‌’ పాటలో శ్రీలంకన్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గ్లామర్‌ను కుర్రకారు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సాంగ్‌ నిడివి తక్కువే. కానీ ఇప్పుడు ఓ ఫుల్‌లెంగ్త్‌ లీడ్‌ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు జాక్వెలిన్‌. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నిధీ అగర్వాల్‌తో పాటు జాక్వెలిన్‌ కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. వీరితో పాటు మరికొంతమంది ఉత్తరాది భామలు కూడా తెలుగుతెరపై కనిపించనున్నారు.

చదవండి:
రన్నింగ్‌ బస్‌లో లిప్‌లాక్‌.. ‘రొమాంటిక్‌’గా పూరీ కొడుకు

స్టేజ్‌పైనే..హీరోను 'అన్నా' అని పిలిచిన హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు