Space: వ్యోమ గాములు, శాస్త్రవేత్తల బయోపిక్స్‌ విశేషాలు..

14 Jul, 2021 09:28 IST|Sakshi

నింగిలో ఏం ఉంది? తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. వెళ్లి తెలుసుకునే ధీరోదాత్తులు కొందరే ఉంటారు. గతంలో రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా వంటివారు స్పేస్‌కి వెళ్లారు. తాజాగా అంతరిక్ష యానం చేసిన తొలి తెలుగు అమ్మాయిగా బండ్ల శిరీష రికార్డ్‌ సాధించారు. ఆస్ట్రోనాట్‌లను నింగికి పంపడానికి నేల మీద శాస్త్ర వేత్తలు జె. అబ్దుల్‌ కలామ్, నంబి నారాయణన్‌ వంటివారు కృషి చేశారు. వ్యోమ గాములు... శాస్త్రవేత్తల జీవితం ఆదర్శప్రాయం. అందుకే రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, అబ్దుల్‌ కలామ్, నంబి నారాయణన్‌ బయోపిక్స్‌కి శ్రీకారం జరిగింది. ఆ చిత్రాల విశేషాలను తెలుసుకుందాం.

కల్పనా చావ్లా
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా ఆస్ట్రోనాట్‌ కల్పనా చావ్లా. 1997లో కల్పన అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో స్పేస్‌ మిషన్‌ కోసం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకునే క్రమంలో జరిగిన ప్రమాదంలో కల్పన మరణించారు. ఇండియా నేషనల్‌ హీరోస్‌లో ఒకరు అనిపించుకున్న కల్పనా చావ్లా 40 ఏళ్ళ వయసులోనే మరణించడం విషాదం. అయితే కల్పన సాధించిన ఘనత మాత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకుని రావాలనుకున్నారు ‘చక్‌ దే ఇండియా’ డైరెక్టర్‌ షిమిత్‌ అమిన్‌. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఓ సందర్భంలో హీరోయిన్‌ వాణీ కపూర్‌ వెల్లడించారు. అయితే ప్రియాంక దాదాపు ఖరారయ్యారని టాక్‌.

సుశాంత్‌ సింగ్‌ - చందమామ దూర్‌ కే
యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎన్నో కలలు కన్నాడు. అందులో వ్యోమగామి పాత్ర చేయాలన్న కల ఒకటి. 2017లో సంజయ్‌ పూరన్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు కూడా. అసలు సిసలైన ఆస్ట్రోనాట్‌గా ఒదిగిపోవడానికి సుశాంత్‌ ‘నాసా’లో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే గత ఏడాది సుశాంత్‌ ఆకస్మిక మరణంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ‘చందమామ దూర్‌ కే’ టైటిల్‌తో సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమా ఆగలేదని దర్శకుడు సంజయ్‌ చెబుతూ – ‘‘సుశాంత్‌ మరణం నాకు తీరని లోటు. ‘చందమామ...’ కథ ఆయనకు చాలా నచ్చింది. కొన్ని ఇన్‌పుట్స్‌ కూడా ఇచ్చారు. అందుకే సుశాంత్‌కి నివాళిగా ఈ సినిమా తీస్తాను. కానీ ఎప్పుడు తీస్తానో చెప్పలేను’’ అన్నారు.

ఏపీజే అబ్దుల్‌ కలామ్‌
భారతరత్న అవార్డుగ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకునే ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌), ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) సంస్థల్లో నిర్వహించిన బాధ్యతల ద్వారా భారత అంతరిక్ష రంగం అభివృద్ధికి అబ్దుల్‌ కలామ్‌ ఎంతో కృషి చేశారు. ఆయన జీవితం ఆధారంగా బయోపిక్‌ల ప్రకటనలు వచ్చాయి. నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర ఓ బయోపిక్‌ను ప్రకటించారు. ఇందులో అబ్దుల్‌ కలామ్‌గా నటించనున్నట్లు ప్రముఖ నటుడు పరేష్‌ రావల్‌ గత ఏడాది జనవరిలో వెల్లడించారు. అలాగే అబ్దుల్‌ కలామ్‌ జీవితం ఆధారంగా వస్తున్న మరో చిత్రం ‘ఏపీజే అబ్దుల్‌ కలాం: ది మిసైల్‌ మ్యాన్‌’. ఇందులో అలీ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. జగదీష్‌ తానేటి, సువర్ణ, జానీ మార్టిన్‌ నిర్మిస్తున్నారు.

నంబి నారాయణన్‌
ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రం రూపొందింది. ఇందులో నారాయణన్‌గా మాధవన్‌ నటించి, దర్శకత్వం వహించారు. ‘ఇస్రో’లో ముఖ్య విభాగానికి ఇన్‌చార్జ్‌గా నారాయణన్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఆరోపణల్లో నిజం లేదని, నంబి నారాయణన్‌ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాలతో తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

రాకేశ్‌ శర్మ
అంతరిక్షంలో కాలుమోపిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి రాకేశ్‌ శర్మ బయో పిక్‌ గురించి 2018లో ఓ ప్రకటన వచ్చింది. మహేశ్‌ మాథై దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ నిర్మించనున్నారు. ‘సారే జహా సే అచ్చా’ టైటిల్‌ కూడా అనుకున్నారు. మొదట్లో హీరోగా ఆమిర్‌ ఖాన్‌ పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత షారుక్‌ ఖాన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇక వరుసగా రణ్‌బీర్‌ కపూర్, విక్కీ కౌశల్‌ లేటెస్ట్‌గా ఫర్హాన్‌ అక్తర్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనలైజ్‌ కాలేదు. ఈ సినిమా ప్రకటించి మూడేళ్లయిన నేపథ్యంలో ఆగిందనే వార్త గతేడాది ప్రచారంలోకి వచ్చింది. అయితే సినిమా ఆగిపోలేదని, వర్క్‌ జరుగుతోందని సిద్ధార్థ్‌ రాయ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు