బాలీవుడ్‌లో విషాదం: లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కన్నుమూత

22 May, 2021 12:52 IST|Sakshi

బాలీవుడ్‌ సంగీత దిగ్గజం రామ్‌లక్ష్మణ్‌ గుండెపోటుతో కన్నుమూశారు. ​ఆయన వయసు 78 సంవత్సరాలు. మైనే ప్యార్‌ కీయా, హమ్‌ ఆప్‌కే కౌన్‌, హమ్‌ సాథ్‌ సాథ్‌ హై, 100 డేస్‌ లాంటి సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ సినిమాలకు పాటలు అందించింది ఈయనే. ఈయన అందించిన బాణీలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.  

తొంభై దశకంలో అద్భుతమైన పాటలు అందించిన రామ్‌ లక్ష్మణ్‌ అసలు పేరు విజయ్‌ పాటిల్‌. ​శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు అమర్‌ తెలిపాడు. కాగా, కొన్నిరోజుల క్రితం రామ్‌ లక్ష్మణ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారని, ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుండగానే గుండెపోటుతో చనిపోయినట్లు అమర్‌, మీడియాకు వెల్లడించాడు.

గానకోకిల లతా మంగేష్కర్‌ రామ్‌ లక్ష్మణ్‌ మృతి పట్ల ట్విట్టర్‌లో సంతాపం తెలిపింది. ఆయన సంగీతంలో తాను పాడిన పాటలన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆమె గుర్తు చేసుకున్నారు. వీళ్లిద్దరి కాంబోలో ‘దీదీ తేరా దేవర్‌ దివానా’, ‘కబూతర్‌ జా జా’ పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి.

ఇద్దరూ.. ఒక్కడే
రాజ్‌శ్రీ ప్రొడక్షన్‌లో ఎక్కువ సినిమాలకు పనిచేసిన రామ్‌లక్ష్మణ్‌.. 1975 నుంచి హిందీ, మరాఠీ, భోజ్‌పురిలో కలిపి మొత్తం డెబ్భై సినిమాలకు పని చేశారు. అయితే రామ్‌ లక్ష్మణ్‌ ఇద్దరూ వేర్వేరు. రామ్‌(సురేందర్‌), లక్ష్మణ్‌(విజయ్‌పాటిల్‌) ఇద్దరూ మొదట్లో కలిసి పనిచేశారు. 1977లో ఏజెంట్‌ వినోద్‌ సినిమా తర్వాత సురేందర్‌ చనిపోయారు. అప్పటి నుంచి విజయ్‌పాటిల్‌(లక్ష్మణ్‌) రామ్‌లక్ష్మణ్‌గానే కొనసాగుతూ వచ్చారు. 
చదవండి: DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు

మరిన్ని వార్తలు