పాత సినిమాలు... కొత్త సందడి

15 Oct, 2020 00:26 IST|Sakshi

నేటి నుంచి థియేటర్స్‌ తెరుచుకుంటున్నాయి. థియేటర్స్‌ను నమ్ముకున్నవాళ్లకు సందడి మొదలుకానుంది. అయితే థియేటర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ప్రస్తుతానికి ప్రశ్నలే. పరిస్థితిని బట్టి సమాధానాలు దొరుకుతాయి. అయితే థియేటర్స్‌ తిరిగి ఓపెన్‌ అవుతున్న సందర్భంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో రీ–రిలీజ్‌ కాబోతున్న చిత్రాల విశేషాలు.

ఆ సినిమాలను ప్రదర్శించం
లాక్‌డౌన్‌ సమయంలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. థియేట్రికల్‌ విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయిన సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించం అని ప్రకటించాయి పలు మల్టీప్లెక్స్‌ సంస్థలు. ఆ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పుడే మల్టీప్లెక్స్‌ సంస్థలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్‌ ‘శకుంతలా దేవి’, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’, జాన్వీ కపూర్‌ ‘గుంజన్‌ సక్సేనా’, ‘సడక్‌ 2’ వంటి సినిమాలను తమ థియేటర్స్‌లో ప్రదర్శించేది లేదని ఐనాక్స్, పీవీఆర్, సినీపోలీస్, కార్నివాల్‌ వంటి మల్టీప్లెక్స్‌ అధినేతలు నిర్ణయించుకున్నారని సమాచారం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం మోదీ’. వివేక్‌ ఒబెరాయ్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా నేడు మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది. ‘ఈ సినిమా మరింత మందికి చేరువ అవ్వడానికి ఇదో మంచి అవకాశం’ అని అన్నారు చిత్రనిర్మాతలు. హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ చిత్రం ‘వార్‌’. గత ఏడాది ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు భారీగా సాధించింది. ఈ సినిమాను మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. అజయ్‌ దేవగన్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘తన్హాజీ’, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన సందేశాత్మక చిత్రం ‘శుభమంగళ్‌ సావధాన్‌’, తాప్సీ లీడ్‌ రోల్‌ చేసిన ‘థప్పడ్‌’, ఆదిత్యా రాయ్‌ కపూర్, దిశా పటానీ నటించిన ‘మలంగ్‌’ సినిమాలు కూడా మళ్లీ విడుదల కానున్నాయి. వీటికి తోడు ఇటీవలే ‘పే ఫర్‌ వ్యూ’ (డబ్బుకట్టి సినిమా చూడటం) పద్ధతిలో విడుదలయిన హిందీ చిత్రం ‘ఖాలీ పీలీ’, తమిళ చిత్రం ‘కాపే రణసింగం’ అక్టోబర్‌ 16 నుంచి థియేటర్స్‌లోకి రానున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా