ఎవరీ గ్యాంగ్‌?

1 Aug, 2020 01:10 IST|Sakshi

బయటకే తళుకులు.. లోపలంతా చీకటి రాజకీయాలే ప్రతిభకు పోటు నెపోటిజం అవుట్‌సైడర్స్‌కు తిప్పలు తప్పవు ఈ మధ్య బాలీవుడ్‌ లో బాగా వినిపిస్తున్న విమర్శలివి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ, ప్రశాంతంగా కనిపించే ఏ ఆర్‌ రెహమాన్‌  ‘నాకు హిందీ సినిమాలు రానీకుండా ఓ గ్యాంగ్‌ పని చేస్తోంది’ అని ఆరోపించడం సంచలనం అయింది.

ఇంతకీ ఎవరీ గ్యాంగ్‌? ఈ గ్యాంగ్‌ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  ఇక రెహమాన్‌ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా స్పందించినవారి గురించి తెలుసుకుందాం. రెహమాన్‌ బిజీ కంపోజర్‌. ఎప్పుడూ నాలుగైదు ప్రాజెక్ట్స్‌  చేతిలో ఉంటాయి. అయితే హిందీలో మాత్రం తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది ఆయన అంతట తగ్గించింది కాదు తగ్గించబడింది అట.

‘హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నారెందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు.  ‘నాకు సినిమాలు రాకుండా బాలీవుడ్‌ లో కొందరు గ్రూపిజమ్‌ చేస్తున్నారు. ట్యూన్స్‌ ఇవ్వడంలో ఆలస్యం చేస్తానని, ఇలా మరికొన్ని అవాస్తవమైన వార్తలు నా మీద çసృష్టించారు. నాకు సినిమాలు రానివ్వకుండా ఓ గ్యాంగ్‌ పని చేస్తోంది’’ అని తెలిపారు రెహమాన్‌.

ఆస్కార్‌ విజేత రెహమాన్‌కి కూడా ఇలా అవుతుందా? అని షాకయ్యారందరూ. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రెహమాన్‌కే ఇలా జరిగితే ఇక వేరేవాళ్ల పరిస్థితేంటి? అనే చర్చకు దారితీసింది. గ్రూపిజమ్, ఫేవరెటిజమ్‌ తో నచ్చినవాళ్లకు పని కల్పిస్తూ ఇష్టారాజ్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెహమాన్‌కి మద్దుతుగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘‘ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటూ ఉంటాను’’ అని రెహమాన్‌ ట్వీట్‌ చేశారు.

‘డబ్బు పొతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పొతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృ«థా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడదాం’’ అని కూడా అన్నారు రెహమాన్‌.

బాలీవుడ్‌ గురించి కొందరి మాటలు విన్నాక గ్యాంగ్‌ కుట్రలు, గ్రూపిజాలు ఉన్నాయని అర్థమవుతోంది. మరి.. ఇవి ఎలా ఆగుతాయి? ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకునే వాతావరణం ఏర్పడుతుందా? బంధుప్రీతి, గ్యాంగ్‌.. వంటి వివాదాలేనా? రేపు మరో కొత్త వివాదానికి  తెరలేస్తుందా? ప్రస్తుతం బయట ఉన్నట్లే బాలీవుడ్‌ లో అంతా అనిశ్చితి!     
                
‘రెహమాన్‌ ఈ  సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్‌ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్‌ గెలవడం అంటే బాలీవుడ్‌ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్‌ హ్యాండిల్‌ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు శేఖర్‌ కపూర్‌.

– శేఖర్‌ కపూర్, సంగీత దర్శకుడు

‘‘రెహమాన్‌ కి కేవలం హాలీవుడ్‌ సినిమాల మీదే ఆసక్తి ఉందని, బాలీవుడ్‌ సినిమాలు చేసే ఆసక్తి లేదని మొదటి నుంచి అతని మీద ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. దాంతో చాలామంది దర్శకులు ఆయనకు ఆసక్తి లేదేమో అనుకుని ఉండుంటారు. కానీ ఆయనతో పని చేయాలనుకునేవారు ఆయనతో పని చేస్తూనే ఉన్నారు.

– రియానా, రెహమాన్‌ సోదరి.

నాకూ ఇలానే జరిగింది!
‘‘ఆస్కార్‌  గెలిచిన తర్వాత బాలీవుడ్‌ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ సినిమాల అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను.  హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం’’

– రెసూల్‌ పూకుట్టి, సౌండ్‌ డిజైనర్‌
.

మీకు పరిమితులు లేవు. మీరు కేవలం బాలీవుడ్‌ కాదు. అంతకు మించి. మీరు కంపోజ్‌ చేసిన పాటల్ని వినడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం.

–  శ్వేతా మోహన్, గాయని.

 రెహమాన్‌ లాంటి నమ్మదగ్గ మనిషి మాట్లాడినప్పుడే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని అందరికీ అవగాహన వస్తుంది. థ్యాంక్యూ సార్‌.

– మీరా చోప్రా, నటి.

నెపోటిజం (బంధుప్రీతి) టాపిక్‌ మీద ఇటీవల నేషనల్‌ మీడియాలో తరచూ కనిపిస్తున్న కంగనా కూడా ఈ విషయం మీద మద్దతుగా మాట్లాడారు. ’’ఈ (బాలీవుడ్‌) ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వేధింపులకు గురవుతారు. మరీ ముఖ్యంగా స్వతంత్రంగా పని చేద్దాం అనుకునే వాళ్లు’’ అన్నారు కంగనా.

– కంగనా, నటి

మరిన్ని వార్తలు