Salman Khan 56th birthday: సల్లూ భాయ్‌కి హ్యాపీ బర్త్‌డే, పునర్జన్మ అంటున్న ఫ్యాన్స్‌

27 Dec, 2021 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌.. ఈ పేరు వింటేనే బాక్సాఫీసు షేక్‌ అవుతుంది. సల్లూ భాయ్‌  లేదా భాయీ జాన్‌ అంటే ఫ్యాన్స్‌ ఉర్రూతలూగి పోతారు. మైనే ప్యార్ కియా మొదలు సల్మాన్‌ తన జాదూతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సూపర్‌ స్టార్‌. సల్మాన్ ఖాన్. 56 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబరు 27 సల్మాన్‌ ఖాన్‌ 56వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌, కండల  వీరుడు సల్మాన్ ఖాన్  1965, డిసెంబరు 27న జన్మించాడు. సల్మాన్‌ అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్.  1988 బీవీ హోతో ఐసీ సినిమాలో సహాయనటుడుగా తెరంగేట్రం చేసిన సల్మాన్‌ పెద్దగా సక్సెస్‌ అందుకోలేకపోయాడు. కానీ  ఆ తరువాత మైనే ప్యార్ కియా తో పాపులర్‌ హీరోగా అవతరించాడు. ఈ మూవీ బాక్సీఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూడ లేదు. ముఖ్యంగా  90వ దశకంలో  హమ్ ఆప్కే హై కౌన్, కరన్ అర్జున్ , బీవీ నెం.1 హమ్ దిల్ దే చుకే సనమ్, హమ్ సాత్-సాత్ హై ఇలా వరుస సినిమాలతో స్టార్‌హీరోగా ఎదిగాడు. 1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాకుగాను ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నాడు. సల్మాన్‌ నటించిన అన్ని మూవీలు సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి.

అయితే 2000వ దశకంలో కాస్త వెనుకబడినప్పటికీ వాంటెడ్,  దబాంగ్ లాంటి సినిమాలతో మళ్లీ హిట్‌ట్రాక్‌ ఎక్కాడు సల్మాన్. బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, కిక్ , బజరంగీ భాయీ జాన్, ప్రేమ రతన్‌ ధన్‌ పాయో వరుసగా తొమ్మిది సినిమాలు  రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టాయి. దీంతో బాలీవుడ్ చరిత్రలోనే వరుసగా ఎక్కువ వసూళ్లు సాధించిన ఏకైక నటుడుగా ఘనత దక్కించున్నాడు. అంతేకాదు బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ భజరంగీ భాయీజాన్ సినిమాలోని నటనకు బెస్ట్‌ యాక్టర్‌గా ఫిలింఫేర్ నామినేషన్ లభించింది.అయితే ఈ అవార్డు నిరాశ పర్చినా,  9 సార్లు అదే కేటగిరీకి నామినేట్‌  అయిన రికార్డు కూడా సల్మాన్‌దే.  

రూ. 11వేల నుంచి కోట్ల రెమ్యూనరేషన్‌ దాకా

సల్లు భాయ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 33 ఏళ్లలో కోట్ల రూపాయల రెమ్యూ నరేషన్‌ తీసుకునే స్టేజ్ కు చేరుకోవడం విశేషం.  బాక్సాఫీస్ భారీ డిజాస్టర్‌, సల్మాన్‌ డెబ్యూ మూవీ బీవీ హోతే ఐసీ ద్వారా సల్మాన్  అందుకున్న పారిపోషికం రూ. 11 వేల రూపాయలు మాత్రమే. ఇక బ్లాక్‌ బస్టర్‌మూవీ మైనేప్యార్‌ కియా తరువాత ఆయన కరెరియర్‌ పీక్‌కు చేరింది. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చినప్పటికి, ప్రస్తుతం 100 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకునే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు  బాలీవుడ్‌ స్టార్‌ హీరోగా పేరుతెచ్చుకున్న సల్మాన్‌ బుల్లితెరపై బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. పాత్రల కోసం శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడని హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. భారీ కసరత్తులు, కండలు,  బాడీ బిల్డింగ్‌కు సల్మాన్‌ పెట్టింది పేరు. బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

అయితే 55 ఏళ్లు దాటినా ఇంకా బ్యాచిలర్‌గానే ఉండిపోయిన సల్మాన్‌ లవ్‌ట్రాక్‌ కూడా పెద్దదే. మాజీ ప్రియురాళ్లలో బాగా పాప్యులర్ అయింది ఇద్దరు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్‌తో  సాగించిన ప్రేమాయణం అప్పట్లో హాట్‌ టాపిక్‌.  ప్రస్తుతం రొమేనియన్‌ బ్యూటీ లులియా వాంతూర్‌తో  సహజీవనం చేస్తున్నట్టు బాలీవుడ్‌ టాక్‌. మెంటర్‌గా, దాతగా నిలవడమే గాకుండా అనాథ చెల్లికి ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసి శభాష్‌ అనిపించుకున్న సల్మాన్‌ పలు వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు. ముఖ్యంగా అరుదైన కృష్ణజింకలను వేటాడిన కేసు, మద్యం మత్తులో కారు నడిపి అయిదుగురిని హత్య  చేసిన ఆరోపణలు వెల్లువెత్తాయి.  అయితే జింకలను వేటాడిన 2015లో ఐదేళ్ళ జైలుశిక్ష వేసిన కోర్టు కొన్నిరోజుల తరువాత ఆయనను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరోల‌తో కలిసి తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టు కునేందుకు రడీ అయిపోతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తోన్న గాడ్ ఫాద‌ర్‌ మూవీ ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సల్మాన్‌, విక్టరీ వెంక‌టేశ్‌తో  కూడా సినిమా చేయ‌బోతున్నాడని టాలీవుడ్‌ టాక్‌.

పాముకాటు: పునర్జన్మ
ఇది ఇలా ఉంటే శనివారం రాత్రి పాముకాటుకు  గురికావడం ఫ్యాన్స్‌ నుఆందోళనలోకి నెట్టేసింది. అయితే సురక్షితంగా ఆయన బయటపడటంతో భాయీజాన్‌కు ఇది పునర్జన్మ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలందిస్తున్నారు. టైగర్‌ జిందా హై అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

 
 

మరిన్ని వార్తలు