బాక్సర్‌ను వివాహమాడిన నటి

20 Jan, 2021 17:51 IST|Sakshi

ముంబై: బాక్సర్‌ ప్రదీప్‌ ఖరేరా(25) మరాఠి నటి మానసి నాయక్‌ను వివాహమాడాడు. పుణెలో అత్యంత సన్నిహితుల మధ్య మహరాష్ట్రీయుల సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్తజంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. గులాబీ రంగు లెహంగాలో వధువు మానసి చూడముచ్చటగా కనిపించగా.. వరుడు ప్రదీప్‌ బంగారు వర్ణపు షేర్వాణీ ధరించి హుందాగా కనిపించాడు. పెళ్లి వేడుక అనంతరం కొత్తజంట వరుడి స్వస్థలం హర్యానాకు తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి వివాహానంతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.(చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు)

కాగా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తాము త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు మానసి- ప్రదీప్‌ ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. మంగళవారం వివాహ బంధంతో ఒక్కటైనట్లు తెలిపారు. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్‌ ఖారారే.. వరల్డ్‌ బాక్సింగ్‌ కౌన్సిలింగ్‌ ఏషియన్‌ టైటిల్‌ సాధించి సత్తాచాటాడు. ఇక మానసి.. జబర్దస్త్‌, తూక్యా తుక్‌విలా నగ్యా నచ్‌విలా వంటి సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. బాగ్తోయి రిక్షావాలా అనే డాన్స్‌ నంబర్‌తో ఆమె పాపులర్‌ అయ్యారు.

ఇక తన పెళ్లి అనంతరం మానసి మాట్లాడుతూ.. ఎట్టకేలకు మిసెస్‌ ఖరేరా అయినందుకు సంతోషంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించేలేనంటూ హర్షం వ్యక్తం చేశారు. తన సోల్‌మేట్‌తో పాటు అతడి కుటుంబం కూడా ఎంతో ఆప్యాయంగా తనను అక్కున చేర్చుకుందని చెప్పుకొచ్చారు. కాగా ప్రదీప్‌- మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు.

మరిన్ని వార్తలు