కిక్‌ కొడితే కిక్కే!

22 Jun, 2021 00:39 IST|Sakshi

తెరపై విలన్‌ ముఖం మీద హీరో ఒక్క కిక్‌ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్‌. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్‌ ఇవ్వనున్నారు. బాక్సర్‌ అవతారంలో కిక్‌ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం.

యూత్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘లైగర్‌’ కోసం బాక్సర్‌ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్‌. దీంతో ‘లైగర్‌’ సినిమాలో బాక్సింగ్‌ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్‌  చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘లైగర్‌’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ ‘గని’ చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఇందులో బాక్సర్‌ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్‌. లాక్‌డౌన్‌ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్‌ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్‌ పలు సందర్భాల్లో సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్‌ నుంచి సాలిడ్‌ బాక్సింగ్‌ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది.

ఈ  చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్‌ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్‌ మెహ్రా కాంబినేషన్‌లో వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్‌. ఇప్పుడు ‘తుఫాన్‌’ కోసం వీరి కాంబినేషన్‌ రిపీటైంది. అయితే ‘తుఫాన్‌’లో ఫర్హాన్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్‌ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య  శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్‌ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్‌. ‘బ్రూస్‌లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్‌ విజయ్‌ హీరోగా తమిళంలో ‘బాక్సర్‌’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్‌ ఓ హీరోయిన్‌. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్‌ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్‌ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్‌ ఖాయం అనే అంచనాలున్నాయి. 

మరిన్ని వార్తలు