నవరాత్రి: ఈరోస్‌ నౌ పోస్టులపై నెటిజన్ల ఫైర్‌!

22 Oct, 2020 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓటీటీ ఈరోస్‌ నౌ నెటిజన్లను క్షమాపణ కోరింది. మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతుల పట్ల తమకు గౌరవభావం ఉందని, తాము షేర్‌ చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఈరోస్‌ నౌ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. అసలేం జరిగిందంటే.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారన్న విషయం తెలిసిందే. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలతో దుర్గామాతను పూజిస్తారు. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో నవ వర్ణాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?)

ఆయా రోజుల్లో పసుపు, ఆకుపచ్చ, బూడిద, నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, గులాబి, ఊదా తదితర రంగులు కలిగిన దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో చాలా మంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తులు వేసుకుని సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోస్‌ నౌ.. తమ మాతృసంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ల స్టిల్స్‌ను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేస్తోంది. హీరోయిన్ల అవుట్‌ఫిట్‌ రంగులకు మ్యాచ్‌ అయ్యే డ్రెస్సులు ధరించి తమతో ఫొటోలు పంచుకోవాల్సిందిగా నెటిజన్లకు సూచించింది. అయితే ఈరోస్‌ నౌ టీం రూపొందించిన ఐడియా నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘వినూత్న’థీమ్‌ చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్‌ చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదా అంటూ విరుచుకుపడుతున్నారు. (‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’)

ముఖ్యంగా.. ‘‘ఎరుపు అంటేనే అంతులేని విశ్వాసం. ప్రేమకు చిహ్నం. నవరాత్రి. నాలుగో రోజు రెడ్‌ కలర్‌. చూడండి ఎంత బాగున్నారో’’ అంటూ షేర్‌ చేసిన కత్రినా కైఫ్‌, కరీనా కపూర్ ఫొటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఇక పసుపు రంగు చీరలో ఉన్న కత్రినా ఫొటోతో వారి కోపం నశాళానికి అంటింది. దీంతో  #BOYCOTTEROSNOWను ట్రెండ్‌ చేస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. పిచ్చి పిచ్చి మీమ్స్‌తో ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న ఈరోస్‌ నౌ కంటెంట్‌ను వీక్షించబోమని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాస్తైనా సిగ్గుపడండి అంటూ చురకలు అంటిస్తున్నారు. అంతేగాకుండా కత్రినాకు సంబంధించిన మరికొన్ని స్టిల్స్‌ షేర్‌ చేసి, పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ ఏకిపారేశారు.

అంతేగాక మతాలకు అతీతంగా ప్రతీ సందర్భంలోనూ ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయగల దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగివచ్చిన ఈరోస్‌ బృందం తాము చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ ఫొటోలు డెలిట్‌ చేసింది. కాగా ఇటీవల తనిష్క్‌ సైతం ట్రోలింగ్‌ బారిన పడటంతో తమ యాడ్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు