Brahmanandam: అసూయపడ్డారు, నా పనైపోయిందన్నారు: బ్రహ్మానందం

26 Mar, 2023 14:47 IST|Sakshi

నవ్వినంత ఈజీ కాదు నవ్వించడం.. కానీ కమెడియన్లు రకరకాల డైలాగులతో, స్కిట్లతో, పంచులతో, చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సింగిల్‌ డైలాగ్‌ లేకుండా కేవలం హావభావాలతోనూ నవ్వించగల దిగ్గజ నటుడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలే చేసిన ఆయన రంగమార్తాండలో వైవిధ్యమైన పాత్ర పోషించాడు. బ్రహ్మీని ఇలా చూడటం కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్‌.

తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నా జీవితంలో జరుగుతున్నదేదీ ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులున్నాయి. అటువంటిది ఎమ్‌ఏ చదివాను, లెక్చరర్‌ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను.

ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు. నేను స్టార్‌ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్‌ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్‌, ఎల్బీ శ్రీరామ్‌ వచ్చారు.. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు.. ఇలా కొత్తగా ఏ కమెడియన్‌ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు. నాకది చాలు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం.

మరిన్ని వార్తలు