ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్‌

3 Sep, 2022 08:45 IST|Sakshi

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా చేయగలం. ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి. మన ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు, గొప్ప చిత్రాలు తీయాలి.. తీస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది.

కాగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ–‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలా మంది నటులున్నారు. కానీ, కొందరు మాత్రమే నాపై ప్రభావం చూపారు. అమితాబ్‌ బచ్చన్‌గారు, రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటెన్సిటీ అంటే నాకు చాలా ఇష్టం. వీరి నుంచి ఓ యాక్టర్‌గా నేను స్ఫూర్తి పొందాను. రాజమౌళి, కరణ్‌ జోహార్‌గార్లు ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగా మార్చారని నమ్ముతున్నాను. మా నాగార్జున బాబాయ్‌ నటించిన హిందీ చిత్రం ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ తెలుగు హీరో హిందీలో డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తొలిసారి ఆ సినిమా చూసి తెలుసుకున్నాను’అన్నారు. 

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ–‘‘రాజమౌళిగారు ‘బ్రహ్మాస్త్రం’ని సమర్పిస్తున్నారంటే సినిమా అలా ఇలా ఉండదు. ఆయాన్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో భాగమయ్యారు. రాజమౌళిగారు ఓ సినిమాని మూడేళ్లు చెక్కుతారు.. అలా ఆయాన్‌ కూడా ‘బ్రహ్మాస్త్రం’ ని మూడేళ్లు చెక్కారు’’ అన్నారు.

(చదవండి: తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు

రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్‌ వేడుకను గ్రాండ్‌గా చేయాలనుకుని ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల కిందట పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. అయితే శుక్రవారం ఎక్కువగా వినాయక నిమజ్జనాలు ఉండటం వల్ల ప్రీ రిలీజ్‌ వేడుకకి బందోబస్తు ఇవ్వడం కష్టమని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు చెప్పారు.. దీంతో ప్రీ రిలీజ్‌ వేడుకని క్యాన్సిల్‌ చేసి, ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నాం. ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో భాగం కావాలని ఐదేళ్ల కిందట కరణ్‌గారు చెప్పడంతో ఓకే అన్నాను. ఆయాన్‌ ముఖర్జీ ఈ కథ చెప్పినప్పుడు నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు. ‘‘తారక్‌ అమేజింగ్‌ యాక్టర్‌. ఆయాన్‌ ముఖర్జీ పదేళ్ల ఆలోచనల రూపం ‘బ్రహ్మాస్త్రం’’ అన్నారు

కరణ్‌ జోహార్‌ ‘‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్రం’. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రణ్‌బీర్‌ కపూర్‌. ‘‘ఈ సినిమా మాకో ఎమోషన్‌’’ అన్నారు ఆలియా భట్‌. నటి మౌనీరాయ్, ధర్మ ప్రొడక్షన్స్‌ సీఈవో అపూర్వ మెహతా, ప్రైమ్‌ ఫోకస్‌ ఫౌండర్‌ నమిత్‌ మల్హోత్రా, డీస్నీ స్టార్‌ ప్రెసిడెంట్‌ మాధవన్, స్టార్‌ స్టూడియోస్‌ హెడ్‌ విక్రమ్‌ దుగ్గల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు