Brahmastra Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ

9 Sep, 2022 17:58 IST|Sakshi
Rating:  

టైటిల్‌: బ్రహ్మాస్త్రం
నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమితాబచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌, షారుఖ్‌ఖాన్‌ తదితరులు 
నిర్మాణ సంస్థలు : స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌
దర్శకత్వం : అయాన్‌ ముఖర్జీ
సంగీతం : ప్రీతమ్‌
సినిమాటోగ్రఫీ:సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ 
విడుదల తేది: సెప్టెంబర్‌ 9, 2022

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా  చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలైంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా  నటించనగా, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 9) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటంతో ‘బ్రహ్మాస్త్రం’పై టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. మరి బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం ‘శివ’ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
అన్ని అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం. మూడు ముక్కలైన ఈ శక్తివంతమైన అస్త్రాన్ని తరతరాలుగా బ్రహ్మాన్ష్‌ సభ్యులు కాపాడుతుంటారు. ఈ మూడు ముక్కల్లో ఒక భాగం సైంటిస్ట్‌ మోహన్‌ భార్గవ్‌(షారుఖ్‌ ఖాన్‌), రెండో భాగం ఆర్టిస్ట్‌ అనీష్‌(నాగార్జున)దగ్గరు ఉంటాయి. మూడో భాగం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్రహ్మాస్త్రం స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంది జునూన్‌(మౌనీరాయ్‌). తన టీమ్‌తో కలిసి మూడు ముక్కలను వెతికి పట్టుకొని వాటిని అతించేందుకు ప్రయత్నిస్తుంది. జునూన్‌ బృందం ప్రయత్నానికి అడ్డుతగులుతాడు శివ(రణ్‌బీర్‌ కపూర్‌). డీజే నడుతూ జీవనం సాగించే శివకి, బ్రహ్మాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? అతను ఎందుకు జునూన్‌ టీమ్‌ చేసే ప్రయత్నానికి అడ్డుతగులుతున్నాడు? శివ నేపథ్యం ఏంటి?  అగ్నికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో ముక్క ఎవరి దగ్గరు ఉంది? హిమాలయాల్లో ఉన్న గురు(అమితామ్‌ బచ్చన్‌) దగ్గరికి వెళ్లిన తర్వాత శివకు తెలిసి నిజాలు ఏంటి? ప్రియురాలు ఈషా(అలియా భట్‌)తో కలిసి బ్రహ్మాస్త్రాన్ని శివ ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రాసుకున్న కథే ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల ప్రకారం అన్ని అస్త్రాల్లోకెల్లా అంత్యంత శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. దీనిని ఆధారంగా చేసుకొని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు. ప్రపంచానికి మంచి చేసే ఓ శక్తివంతమైన అస్త్రం అది. దానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. దానిని రక్షించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. అదేసమయంలో ఆ శక్తిని దక్కించుకొని ప్ర‌పంచాన్ని శాసించాల‌నుకునే ఓ దుష్ట‌శ‌క్తి  ఉంటుంది. ఆ దుష్టశక్తి భారీ నుంచి ఆ అస్త్రాన్ని ఎలా కాపాడారు అనేదే ఈ చిత్ర కథ. ఈ తరహా నేపథ్యం ఉన్న చిత్రాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. ఇలాంటి చిత్రాలకు అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు తలతిప్పుకోకుండా చేసే స్క్రీన్‌ప్లే కూడా అత్యవసరం. ఈ విషయంలో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ పూర్తిగా తేలిపోయాడు.

గ్రాఫిక్స్‌ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు. బ్రహ్మాస్త్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ చిరంజీవి ఇచ్చే వాయిస్‌ ఓవర్‌తో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. వానారాస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్‌ మోహన్‌(షారుఖ్‌)తో జునూన్‌ టీమఠ్‌ చేసే పోరాట ఘట్టంతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. డీజే శివగా రణ్‌బీర్‌ ఎంట్రీ ఇవ్వడం.. ఈషాతో ప్రేమలో పడడం.. తనకు వచ్చే కలల్ని ఆమెతో పంచుకోవడం.. అనీష్‌ని రక్షించేందుకు వారణాసి వెళ్లడం..అక్కడ నంది అస్త్రాన్ని అనీష్‌ ప్రయోగించడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది.

తెరపై  వచ్చే సీన్స్ మనకు ఎమోషనల్ గా టచ్ అవ్వకుండా అలా వెళ్లిపోతూ ఉంటాయి. శివ, ఈషాల మధ్య ప్రేమ చిగురించడం కూడా పూర్తి సినిమాటిక్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో గురుగా అమితాబ్‌ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. శివ గతం..అతనిలో ఉన్న అగ్ని అస్త్రాన్ని బయటకు తీసుకురావడానికి గురు చేసే ప్రయత్నం కొంతమేర ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఈషాతో శివ నడిపించే ప్రేమాయణం కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నీవేశాలు మాత్రం సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి.  విజువ‌ల్ ఎఫెక్ట్స్‌పై పెట్టిన శ్ర‌ద్ధ.. క‌థ‌, కథనంపై పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
శివ పాత్రలో రణ్‌బీర్‌ చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఈషా పాత్రకు న్యాయం చేసింది అలియా భట్‌. రణ్‌బీర్‌, అలియా మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్‌ అయింది. అయితే వారిద్దరు ప్రేమలో పడిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోదు. వానర అస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్‌ మోహన్‌గా షారుఖ్‌, నంది అస్త్రాన్ని కలిగిన ఉన్న ఆర్టిస్ట్‌ అనీష్‌గా నాగార్జున ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గురుగా అమితాబ్‌ బచ్చన్‌ తెరపై మరోసార తన అనుభవాన్ని చూపించాడు. జునూన్‌గా మౌనీరాయ్‌ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీత‌మ్ నేప‌థ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్‌ వర్క్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు