Brandy Diaries Review: బ్రాందీ డైరీస్ సినిమా ఎలా ఉందంటే..

13 Aug, 2021 19:34 IST|Sakshi

టైటిల్‌ : బ్రాందీ డైరీస్
నటీనటులు : గరుడ శేఖర్, సునీతా సద్గురు, నవీన్ వర్మ, కె వి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మద్నే, ఇతరులు.
నిర్మాణ సంస్థ : కలెక్టివ్ డ్రీమర్స్
నిర్మాతలు : లేళ్ల శ్రీకాంత్
రచన - దర్శకత్వం : శివుడు
సంగీతం :   ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్
ఎడిటింగ్‌: యోగ శ్రీనివాసన్
విడుదల తేది : ఆగస్ట్‌ 13,2021

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో సినిమాలన్ని థియేటర్ల ముందు క్యూ కడుతున్నాయి. గతవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 13) ఏకంగా 7 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో బ్రాందీ డైరీస్ ఒకటి. నాచురల్ లోకేషన్స్ లో, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలను ‘బ్రాందీ డైరీస్‌’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. 

కథ
గుంటూరు జిల్లాలోకి ఓ చిన్న పల్లెటూరికి చెందిన శ్రీను (గరుడ శేఖర్‌) కలెక్టర్‌ కావాలనే ఆశతో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఐఏఎస్‌ కోచింగ్‌ తీసుకుంటాడు. ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకొని కొద్ది రోజుల పాటు కష్టపడి చదువుతాడు. ఆ తర్వాత మెల్లిగా మద్యానికి అలవాటు పడతాడు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారి తాగుబోతుగా మారిపోతాడు. అక్కడే ఉంటే ఇంకా చెడిపోతాడనే భావించి స్నేహితులు.. అతన్ని మళ్లీ గుంటూరుకు పంపిస్తారు. అక్కడ ఓ బార్‌కి వెళ్లిన శ్రీనుకు నలుగురు వ్యక్తులు పరిచయం అవుతారు. విభిన్న వ్యక్తిత్వం గల ఆ నలుగురి పరిచయం శ్రీను జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది? ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీను తాగుబోతుగా ఎలా మారాడు? శ్రీను ప్రాణంగా ప్రేమించిన భవ్య చివరకు అతనికి దక్కిందా లేదా? ఈ మూవీకి ‘బ్రాందీ డైరీస్‌’అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలియాలంటే.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే.

నటీనటులు
ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ మొదలు అందరూ కొత్తవాళ్లే.  కొత్త నటులు, సీనియర్ రంగస్థల నటులు ఉన్నారు. అయినప్పటికీ చక్కగా నటించారు. శ్రీనుగా గరుడ శేఖర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. భవ్య పాత్రలో సునీత సద్గురు మెప్పించింది. అలాగే ప్రొఫెసర్‌ పాత్రలో నటించిన నటుడి యాక్టింగ్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

విశ్లేషణ
దర్శకుడు శివుడికి ఇది తొలి సినిమా. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని  ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్‌ శివుడు మాత్రం తన డెబ్యూ మూవీతోనే ఓ ప్రయోగం చేశాడు.  వ్యవసనం చుట్టు అల్లుకున్న ఓ కుటుంబ కథ ఇది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో కూడిన కథను, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్నాడు. దర్శకుడు ఎంచుకన్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. అలాగే కథలో ట్విస్ట్‌లు లేకపోవడం, తర్వాత వచ్చే సీన్స్‌ ప్రేక్షకుడి ఊహకు అందినట్లుగా ఉండడంతో రొటీన్‌ సినిమా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథను ఎంచుకోవడం మంచి విషయమే. ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి తెరపై చక్కగా చూపించాడు. ఇక ఈ సినిమాకు మరో బలం ప్రకాష్‌ రెక్స్‌ సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఈశ్వరన్ తంగవేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ యోగ శ్రీనివాసన్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు