పాప్‌ సింగర్‌కు మొదటి గెలుపు! ఆమెకు విముక్తి కోరుతూ లక్షల మంది..

15 Jul, 2021 12:02 IST|Sakshi

Britney Spears తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ ‘సగం గెలుపు’ సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్‌(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది.

సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్‌ ఏంజెల్స్‌ కోర్టుకు ఫోన్‌ కాల్‌ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది’ అని కన్నీరు పెట్టుకుంది. గార్డియన్‌షిప్‌ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. 

ఈ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ.. స్పియర్స్‌ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్‌గార్ట్‌ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. జేమీ స్పియర్‌ను బ్రిట్నీ సంరక్షణ నుంచి తప్పించాలన్న పిటిషన్‌పై ఇక నుంచి వాదనలు వినిపించబోతున్నారు రోసెన్‌గార్ట్‌. గతంలో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, సీన్‌ పెన్‌ లాంటి ప్రముఖుల తరపున వాదించారు.

ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్‌ పిటిషన్‌ను రన్‌ చేస్తున్నారు. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితి దృష్ట్యా తండ్రిని తప్పించలేమని కోర్టు గత వాదనల టైంలో స్పష్టం చేసింది. అయితే తదనంతర పరిణామాలు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా మారాయి. స్పియర్స్‌కు చాలాకాలంగా మేనేజర్‌గా వ్యవహరించిన లారీ రుడోల్ఫ్‌తో పాటు ఆమె అటార్నీ సామ్యుయెల్‌ ఇన్‌గ్‌హమ్‌ కూడా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మేనేజర్‌ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి కూడా.

మరిన్ని వార్తలు