లైలా ఓ లైలా...

17 Jan, 2021 11:00 IST|Sakshi

బాలీవుడ్‌లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.  లైలా తృప్తి డిమ్రీ. సన్నిహితులంతా ట్రాప్స్‌ అని పిలుచుకుంటే  ఓటీటీ అభిమానులు బుల్బుల్‌ అంటారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తృప్తి.. మొదట్లో కెమెరా ముందుకు రావడానికి చాలా సిగ్గుపడేదట.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్‌ డిమ్రీ .. ఎయిర్‌ ఇండియా ఉద్యోగి. తల్లి (పేరు తెలియదు).. ఇంటి బాధ్యతలు తీసుకుంది. తృప్తికి ఇద్దరు తోబుట్టువులు. 2017లో ‘పోస్టర్‌ బాయ్స్‌’ సినిమాతో స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చింది తృప్తి. 2018లో రొమాంటిక్‌ మూవీ  ‘లైలా–మజ్ను’లోని లైలా పాత్రతో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. 2020లో హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ ‘బుల్బుల్‌’ల్‌తో ఓటీటీ స్టార్‌గా మారింది. అందులో తన అభినయానికి  విమర్శకుల ప్రసంసలను పొందింది. నెట్‌ ఫ్లిక్స్‌ వీక్షకుల అభిమానటి అయింది. ‘బుల్బుల్‌’ సినిమాలో ప్రధాన పాత్ర నాకు దొరకడం చాలా హ్యాపీ. నా కెరీర్‌ బుల్బుల్‌ ముందు, తర్వాత అని చూసుకుంటే.. కచ్చితంగా మెరుగైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రేక్షకులు నన్ను లీడ్‌ రోల్‌లో చూడటానికి సిద్ధపడుతున్నారు’ అంటుంది.

సినిమా ఫీల్డ్‌లోకి తృప్తి అనుకోకుండా వచ్చింది. తన సోదరుడి స్నేహితుడు ఫొటోగ్రాఫర్‌ కావడంతో.. ఈమె ఫొటోలు తీసి..  ఢిల్లీలోని ఇమేజెస్‌ బజార్‌కు పంపించాడట. వాళ్లు ఫొటో షూట్‌  చేయడానికి ఆమెని ఎంపిక చెయ్యడంతో ఆ ప్రయాణం మొదలైంది. కొన్నాళ్లు యూట్యూబ్‌ చానెల్‌లో కూడా పని చేసింది. ‘కెమెరా అలవాటు పడటానికి యూట్యూబ్‌ చానెల్‌ ఒక అనుభవం’ అని చెప్తుంది తృప్తి. దినేష్‌ డిమ్రీ నటుడు కావాలని కాలేకపోయారట. తండ్రి ఆశయాన్ని తను నెరవేర్చాలనుకుంది.. కనీసం బుల్లితెరపై నటించైనా. నటననే లక్ష్యంగా తీసుకున్న తృప్తి మొదట్లో మోడలింగ్‌ చేసింది. అందులో సంపాదించుకున్న పేరుతో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడానికి ముంబై చేరింది. 

‘నేను నటిని కావాలనుకుంటున్నానని మొదటిసారి ఇంట్లో చెప్పినప్పుడు.. షాక్‌ అయ్యారు. నటి అయితే బయటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు బంధువులతోనే సరిగా మాట్లాడవు కదా? అన్నారు. ఇప్పుడు నేను చాలా నేర్చుకుంటున్నాను. చాలా మారాను కూడా. ఛాన్స్‌ల కోసం అవసరం ఉన్నా లేకున్నా సినిమా వాళ్లందరికీ సలాం కొట్టాలనే సిద్ధాంతాన్ని నేనెప్పుడూ నమ్మను. టాలెంట్‌నే నమ్ముతాను’ అంటుంది తృప్తి డిమ్రీ.

మరిన్ని వార్తలు