‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్‌

2 Oct, 2021 13:58 IST|Sakshi

వెబ్‌ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్‌ పొందిన జానపద పాటగా నిలిచింది.


చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి 

రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాణంలో ఎస్‌కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది.

అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో మరింత వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్‌లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్‌ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్‌లోనే. మిగతా సోషల్‌ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్‌ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది.
చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు

మరిన్ని వార్తలు