‘2018’ చూస్తే తెలియకుండానే మనం కన్నీళ్ళు వస్తాయి: బన్నీ వాసు

24 May, 2023 08:44 IST|Sakshi

‘‘2018’ సినిమా తెలుగు కాపీ చూశాను.. నచ్చింది. సెకండాఫ్‌లో మనకు తెలియకుండానే మనం కన్నీళ్ళు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో మనిషి జీవితం తాలూకు విలువ ఏంటో తెలుస్తుంది. 2018లో కేరళలో వరదల సమయంలో అక్కడి ప్రజలు వారి జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇలాంటి రియలిస్టిక్‌ ఘటనలను కూడా కమర్షియల్‌ అంశాలతో దర్శకుడు చక్కగా చెప్పారు. ఈ సినిమా ఆడియన్స్‌ను థియేటర్స్‌లో టెన్షన్‌ పెడుతుంది.. క్లాప్స్‌ కొట్టిస్తుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు.

టొవినో థామస్‌ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలై ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో గీతా డిస్ట్రిబ్యూషన్, వైజాగ్‌లో ‘దిల్‌’ రాజు, మిగతా ఏరియాల్లో ‘బన్నీ’ వాసు రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2018’ అందర్నీ మెప్పించే విధంగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్‌గారి ‘పుష్ప: ది రూల్‌’ని డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’లో అల్లు అర్జున్‌గారు నటించారన్నది అవాస్తవం. బాలీవుడ్‌ మూవీ ‘అశ్వథ్థామ ఇమ్మోర్టల్‌’ ప్రపోజల్‌ అల్లు అర్జున్‌గారికి వచ్చింది కానీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు