పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌

14 Oct, 2021 00:16 IST|Sakshi

‘‘సినిమా టిక్కెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్‌) వారు మా బాధలు విన్నారు. వాటి పరిష్కార మర్గాల దిశగా ఆలోచిస్తున్నారు’’ అన్నారు  నిర్మాత బన్నీ వాసు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్‌ కానున్న సందర్భంగా బన్నీ వాసు చెప్పిన సంగతలు.

► పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా చూస్తే జీవితం పై ఓ క్లారిటీ వస్తుంది. పెళ్లికి ఎలా ప్రిపేర్‌ అవ్వాలో చెబుతారు కానీ పెళ్లి జరిగాక భార్యతో భర్త ఎలా ఉండాలో అబ్బాయికి, భర్తతో భార్య ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పే తల్లిదండ్రులు తక్కవ. పెళ్లి ముందే కాదు..పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తల్లితండ్రులు నేర్పించాలన్నదే మా సినిమా కాన్సెప్ట్‌.

► ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ దాదాపు ప్రతి థియేటర్‌లో రన్‌ అవుతోంది. ప్రేక్షకులు ఎన్ని టిక్కెట్స్‌ తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వంవారు అడుగుతున్నారు. మన ఎగ్జిబిటర్స్‌లో చాలామంది పన్నులు కట్టడం లేదు. దాదాపు 300 థియేటర్స్‌ జీఎస్‌టీ పరిధిలోనే లేవు. ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఇండస్ట్రీ వల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమైనా చేసిపెట్టండని ప్రభుత్వాన్ని కోరే వీలుంటుంది. చాలామంది ఎగ్జిబిటర్స్‌ టాక్స్‌ పరిధిలోకి రావడం లేదు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించడం లేదనేది ప్రభుత్వం వారి భావన. అందుకే ప్రభుత్వంవారు పారదర్శకత కోరుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వంవారు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారు ఓ రిపోర్ట్‌ తయారు చేయమ న్నారు. ఆ రిపోర్ట్‌ వచ్చాక నిర్ణయాలు ఇండస్ట్రీకి సానుకూలంగానే వస్తాయని నమ్ముతున్నాను.

మరిన్ని వార్తలు