Butta Bomma Review: ‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ

4 Feb, 2023 13:45 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : బుట్టబొమ్మ
నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి తదితరులు
నిర్మాణ సంస్థ:  సితార ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య
స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్
సంగీతం:  గోపీసుందర్, స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: నవీన్ నూలి

కథేంటంటే..
అరకులోని దూది కొండ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. సత్య(అనికా సురేంద్రన్‌)ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి.  తల్లి టైలరింగ్‌ చేస్తే.. తండ్రి రైసు మిల్లులో పని చేస్తుంటాడు. సత్య స్నేహితురాలు లక్ష్మి  ప్రతి రోజు ఫోన్‌లో తన లవర్‌తో మాట్లాడడం చూసి..తనకు కూడా ఒకడు ఉంటే బాగుండు అనుకుంటుంది. దాని కంటే ముందు ఒక కెమెరా ఫోన్‌ కొని రీల్స్‌ చేసి ఫేమస్‌ అయిపోవాలనుకుంటుంది. అలాంటి సమయంలో తనకు ఒక రాంగ్‌ కాల్‌ ద్వారా ఆటో డ్రైవర్‌ మురళి(సూర్య వశిష్ట) పరిచయం అవుతాడు. ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. అదే సమయంలో సత్యను ఇష్టపడే జమిందారు చిన్ని..ఇంట్లో వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు.  ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయంతో చేయడంతో మురళిని చూడటం కోసం సత్య విశాఖ వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది. తనను తను మురళీగా పరిచయం చేసుకున్న ఆర్కే(అర్జున్‌ దాస్‌) తర్వాత ఏం చేశాడు? మురళీకి ఆర్కేకి ఎందుకు గొడవైంది? చివరకు సత్య జీవితం ఏమైంది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
మలయాళ సూపర్‌ హిట్‌ ‘కప్పేలా’ తెలుగు రీమేకే ‘బుట్టబొమ్మ’. ఇదొక సింపుల్‌ కథ. కేవలం రెండు ట్విస్టులను బేస్‌ చేసుకొని సినిమాను తెరకెక్కించారు. అయితే కప్పేలా సినిమా చూసిన వారికి ఆ ట్విస్టులు కూడా తెలిసిపోతాయి కాబట్టి.. బుట్టబొమ్మపై ఆసక్తి ఉండదు. కానీ కప్పేలా చూడని వారికి మాత్రం ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అలాగే తెలుగులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు.

సత్య కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. కథను ప్రారంభించాడు దర్శకుడు. స్నేహితురాలిని చూసి తనకు కూడా ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉండాలనుకోవడం.. ఫోన్‌లో పరిచయం అయిన వ్యక్తితో చాటింగ్‌.. ఆ తర్వాత అతన్ని కలిసేందుకు విశాఖ వెళ్లడం..ఇలా ఫస్టాఫ్‌ అంతా ఓ పల్లెటూరి ప్రేమకథగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ తర్వాత కథ యూటర్న్‌ తీసుకొని థ్రిల్లర్‌గా కొనసాగుతుంది.

ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో ఇది లవ్‌స్టోరీ కాదు.. వేరే కథ అని అర్థమవుతుంది. ప్రస్తుసం సమాజంలో జరుగుతున్న ఓ మోసాన్ని చూపిస్తూ.. యువతకు మంచి సందేశాన్ని అందించారు. అయితే కేవలం రెండు ట్విస్టుల కోసం అదికూడా ఇంటర్వెల్‌ ముందు.. క్లైమాక్స్‌లో వచ్చేవి తప్పా.. మిగత కథనం అంతా రొటీన్‌గా.. సింపుల్‌గా సాగుతుంది. మురళీ, సత్యల ప్రేమాయణం కూడా ఆసక్తికరంగా సాగలేదు. కప్పేలా చూడని వారికి ఈ సినిమాలోని ట్విస్టులు నచ్చుతాయి.

ఎవరెలా చేశారంటే.. 
బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన అనిఖా సురేంద్రన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.  సత్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమా కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.తొలి సినిమాతోనే హీరోయిన్‌గా తనదైన నటనతో మెప్పించింది. ఇక ఆటోడ్రైవర్‌ మురళీ పాత్రకుసూర్య వశిష్ట న్యాయం చేశాడు. ఆర్కేగా అర్జున్‌ దాస్‌ అదరగొట్టేశాడు. అతని వాయిస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవ్యస్వామి, ప్రేమ్ సాగర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  గోపీసుందర్, స్వీకర్ అగస్తి సంగీతం జస్ట్‌ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు