సుశాంత్‌ సింగ్‌ నటించిన ఆ సినిమా రీమేక్‌లో రజనీకాంత్‌!

26 Nov, 2022 09:24 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించే చిత్రాల గురించి ప్రస్తావించగానే ఆయన అభిమానుల్లో ఎక్కడలేని జోష్‌ వస్తుంది. అయితే ఇటీవల సక్సెస్‌ ఆయనతో దోబూచులాడుతుందనే చెప్పాలి. బాషా, పడయప్పా, రోబో లాంటి  హిట్‌ కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జైలర్‌ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నటి రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్న జైలర్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా తదుపరి రజనీకాంత్‌ లైకా ప్రొడక్షన్స్‌లోనే వరుసగా రెండు చిత్రాలు చేయబోతున్నారు. అందులో ఒక చిత్రానికి డాన్‌ చిత్రం ఫేమ్‌ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. రెండో చిత్రానికి రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. దీనికి లాల్‌ సలాం అనే టైటిల్‌ నిర్ణయించారు.  ఇందులో విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించనున్నారు. కాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు.  అతిథి పాత్రే అయినా  చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

తాజాగా జరుగుతున్న ప్రచా రం ఏమిటంటే హిందీలో సుశాంత్‌ సింగ్‌ నటించిన  సూపర్‌ హిట్‌ చిత్రం కైపో చేకు రీమేక్‌ అని. క్రికెట్‌ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ అంశాలతో పాటు మతపరమైన వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి. రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించేది హిందీ చిత్రం  కైపో చేకు రీమేక్‌ అయితే కచ్చితంగా సంచలనాత్మక కథా చిత్రమే అవుతుంది.

మరిన్ని వార్తలు