ఆ ఒక్క మాటతో మీ వెంట ఉంటానన్నాను

9 Dec, 2020 03:29 IST|Sakshi

తెలుగు ఫిలిం ఫ్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్, నిర్మాత సి.కల్యాణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘గతేడాది నా 60వ పుట్టినరోజును చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆనందంగా జరుపుకున్నాను. అది నా జీవితంలో మరచిపోలేని పుట్టినరోజు. కానీ, ఈ ఏడాది పుట్టినరోజు చేసుకోవటం లేదు. ఏ చిత్రసీమ నన్ను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిందో ఆ చిత్రసీమ కార్మికుల కోసం, వారి సమస్యలను తీర్చటం కోసం చిత్రపురి హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. చిత్రపురి కాలనీవాసులు ‘మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి’ అని అడిగినప్పుడు, మీ వైపు నుండి కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి అన్నాను.

అందుకు వారు గురువు దాసరిగారు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసేవారా? అన్నారు. ఆ ఒక్క మాటతో ‘నేను మీ వెంట ఉంటాను’ అని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది నాకు చాలా బాధ్యతాయుతమైన పుట్టినరోజు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన సినీ కార్మికుల కోసం ఎన్నో వరాలను ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిగారిని కలిసినప్పుడు ‘తెలుగు సినిమా పరిశ్రమను వైజాగ్‌లో కూడా డెవలప్‌ చేయండి. మీకు ఏం సాయం కావాలో అడగండి’ అన్నారు.

అప్పుడు నేను జగన్‌గారితో ‘వైజాగ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలనేది వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిగారి కల. మీకోసం రెండొందల ఎకరాల్లో సినిమా పరిశ్రమను రూపుదిద్దుతాను అని సీయం రాజశేఖర్‌ రెడ్డిగారు అన్నప్పుడు ఆరోజు ఆయనతో పాటు ఉన్నవాళ్లల్లో నేనూ ఒకడిని’ అని చెప్పటం జరిగింది. తెలుగు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయితేనే చిత్రపరిశ్రమకు మంచిది. ప్రస్తుతం నేను రానాతో తీసిన  పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘1945 లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. సత్యదేవ్‌ హీరోగా ‘బ్లఫ్‌మాస్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ గణేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం. కె.యస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఓ స్టార్‌ హీరోతో సినిమా ఉంటుంది. ఇవి కాక బాలకృష్ణగారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు